ప్రపంచానికి భారతీయ సినిమాను సరికొత్తగా పరిచయం చేసిన చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. పది రోజుల క్రితం వెండితెరలను తాకిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ. 925 కోట్లను వసూలు చేయగా, నేటి కలెక్షన్లతో రూ. 1000 కోట్ల అరుదైన మార్క్ ను తాకి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించనుందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానించారు. ఈ చిత్రం ఇండియాలో రూ. 745 కోట్లను, విదేశాల్లో రూ. 180 కోట్లను వసూలు చేసింది.
రెండో వారంలోనూ బాహుబలి బాక్సాఫీసు దాడి కొనసాగుతునే ఉంది. మరో వారం పాటు కలెక్షన్లు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రూ. 1000 కోట్ల వసూళ్ల పైనే విశ్లేషిస్తూ కూర్చున్న వారంతా ఇప్పుడు రూ. 1500 కోట్ల మార్క్ వైపు చూస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు అంతకన్నా ఎక్కువే ఉంటాయని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. వేసవి సెలవులతో పాటు పోటీలో చిత్రాలేమీ లేకపోవడంతో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ వున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా అమీర్ ఖాన్ నటించిన పీకే రికార్డును బ్రేక్ చేసేసిన బాహుబలి 2.. గ్రాస్ వసూళ్ల పరంగా అత్యధికంగా సాధించిన చిత్రంగా నిలిచింది. రానున్న రోజుల్లో బాహుబలి మరెన్ని సంచలనాలకు వేదికగా మారుతాడో వేచిచూడాలి.