బీహార్ సర్కారు మద్య నిషేధం విదించింది. అష్టకష్టాలుపడి పోలీసులు మందుబాబులకు చెక్ పెడితే… వాళ్ల బదులు తామున్నామంటూ అక్కడి ఎలుకలు పోలీసులకు సవాల్ విసిరాయి.. ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా 9 లక్షల లీటర్లు మద్యం మూడోకంటికి తెలియకుండా గుటకాయ స్వాహా చేసేశాయి. గతేడాది నుంచి బీహార్ లో మద్య నిషేధం కొనసాగుతోంది. దీంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ యంత్రాంగం మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. లిక్కర్ అక్రమ అమ్మకాలను బట్టబయలు చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో మద్యాన్ని ధ్వంసం చేశారు. కొంత స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ గోదాముల్లోకి తరలించారు.
అయితే, పట్టుబడిన మద్యంలో చాలాభాగం రవాణా చేసేటప్పుడు వృథా అయిందట. ఇదిపోగా దాదాపు 9 లక్షల లీటర్ల మద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ లోని గోదాముల్లో భద్రపరిచారు. ఇందుకు సంబంధించి ఇటీవల అధికారులు లెక్కలు తీయగా ఆ మద్యం మాయమైందని అధికారులు బదులిచ్చారు. దీనికి కారణం ఎలుకల బెడదేనని… అవి ఉన్న మందంతా తాగేశాయని చెప్పేశారు.
దీంతో బిత్తరపోయిన ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బీహార్ అదనపు డీజీపి ఎస్‌కే సింఘాల్ మాట్లాడుతూ… ‘‘ఈ విషయంపై విచారణ జరపాల్సిందిగా పాట్నా జోనల్ ఐజీకి బాధ్యతలు అప్పజెప్పాం. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.