భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఘన విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న ఇస్రో మరోసారి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. జీశాట్-9 ఉపగ్రహ ప్రయోగానికి నిన్న కౌంట్ డౌన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సాంకేతిక ఉపగ్రహం నెల్లురూ జిల్లాలోని శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహంతో పాకిస్థాన్ మినహా 7 సార్క్ దేశాలు జీశాట్-9 వల్ల లబ్ధి పొందనున్నాయి.
నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, శ్రీలంక దేశాలు ఈ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ సేవలను పొందవచ్చు. దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌తో ప్రయోగిస్తున్న రాకెట్ల శ్రేణిలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-9 నాల్గవది. సార్క్ సభ్య దేశాల మధ్య సాంకేతిక స్నేహబంధాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. రూ.235 కోట్ల వ్యయంతో భారత్ దీన్ని రూపొందించింది.
ఇస్రో చేపట్టిన చారిత్రక ప్రయోగం విజయవంతమవడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. ఈ ప్రయోగం భారత్‌ను దక్షిణాసియాలో నాయకత్వ స్థానంలో నిలిపిందని పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలకు ఈ ప్రయోగం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ 12 ఏండ్లపాటు భారత్, దాని పొరుగు దేశాలకు ఉచితంగా సాంకేతిక సేవలందించనుంది. దక్షిణాసియాలో దేశాల మధ్య సమాచార మార్పిడి, విపత్తుల నిర్వహణలోనూ ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఉపగ్రహ బరువు 2వేల కిలోలను మించి ఉండటం వల్ల జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్09 ని ఉపయోగించారు. జీశాట్-9లో ఇస్రో తొలిసారిగా విద్యుత్ చోదక వ్యవస్థను ఉపయోగించింది. ఫలితంగా ఇందులో రసాయన ఇంధనాన్ని తగ్గించి, ఉపకరణాలను పెంచుకునే అవకాశం ఏర్పడింది.
ఉపగ్రహ వివరాలు..
ఉపగ్రహం బరువు: 2230 కిలోలు
ఉపగ్రహ తయారీ వ్యయం: రూ.235 కోట్లు
మొత్తం ప్రాజెక్టు వ్యయం: రూ.450 కోట్లు
పేలోడ్: 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు
ఉపగ్రహ జీవితకాలం:12 ఏళ్లు
జీవితకాలంలో అయ్యే వ్యయాలు: 150 కోట్ల డాలర్లు
ప్రయోగించే రాకెట్: జీఎస్‌ఎల్‌వీ మార్క్-2