తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి2 ఇప్పటికే 700 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లపై బాహుబలి-2 ప్రదర్శితమైంది. దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మల్టీప్లెక్స్‌ల్లో రోజుకు 15 నుంచి 20 షోలు నడిచాయి. గత పదేళ్లలో ఏ సినిమాకీ లేని విధంగా 96 శాతం ఆక్యుపెన్సీ సాధించి బాహుబలి సత్తాచాటింది ‘బాహుబలి’.
ఇదిలాఉంటే.. భారతీయ సినిమాలకు పాకిస్థాన్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ సినిమాలు అక్కడ రెగ్యులర్ గా రీలీజ్ అవుతుంటాయి. తాజాగా సంచలనం విజయంతో రికార్డులను తిరగరాస్తున్న ‘బాహుబలి-2’ సినిమా కోసం అక్కడి సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని తమ దేశంలో కూడా విడుదల చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా వారు కోరుతున్నారు. దీంతో ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయడానికి బాహుబలి నిర్మాతలు కూడా రెడీ గానే ఉన్నారని సమాచారం.
ఇదిలాఉంటే…భారతీయ సినిమాల రిలీజ్ పై పాక్ సెన్సార్ బోర్డు కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంటుంది. హిందుత్వాన్ని ప్రమోట్ చేసే సినిమాలకు అక్కడి సెన్సార్ బోర్డు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయీజాన్’ సినిమాపై పాకిస్థాన్ బ్యాన్ విధించింది.
ఇక ‘బాహుబలి-2’ విషయానికి వస్తే… హిందూ దేవుళ్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమాపై అక్కడి సెన్సార్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వస్తే… దాయాది దేశంలో కూడా మన తెలుగు సినిమా విశ్వరూపం చూపించడం ఖాయం. మొత్తానికి ఒక తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో క్రేజ్‌ని సంపాధించుకుందంటే అది ‘బాహుబలి’ మాత్రమే.