Tirumala:అలిపిరి మార్గంలో ఫెన్సింగ్

28
- Advertisement -

తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, ఎస్పీ, అటవీ శాఖ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశామని, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగిస్తామని తెలిపారు. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టులు 24/7 ఏర్పాటు చేసి అనిమల్ ట్రాకర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. రోడ్డుకిరువైపులా 30 అడుగుల దూరం కనిపించేలా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తారని, అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రూరమృగాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు అలిపిరి, గాలిగోపురం, ఏడో మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.

అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులతో సహా అనుమతిస్తామన్నారు. పెద్దవారిని రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారి భక్తులకు సహాయకారిగా ఉండేలా ప్రతి ఒక్కరికీ ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. భక్తులను గుంపులుగా పంపుతామని, వీరికి సెక్యూరిటీ గార్డులు భద్రతగా ఉంటారని చెప్పారు.

Also Read:ఆ సమస్యలన్నీ బ్రెయిన్స్ స్ట్రోక్ లక్షణాలే..!

- Advertisement -