ప్రతీకారం తీర్చుకోండి..

178
Army vows appropriate response
Army vows appropriate response
- Advertisement -

ఇద్దరు భారత జవాన్ల దేహాలను ఖండఖండాలుగా నరికి ఛిద్రం చేసిన పాకిస్థాన్ ఆర్మీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియన్ ఆర్మీ కదిలింది. దీంతో నియంత్రణ రేఖ వెంబడి కృష్ణ ఘాటీ సెక్టార్‌ కు సమీపంలో ఉన్న పాకిస్థాన్‌ కు చెందిన రెండు పోస్టులను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌ సైన్యంలోని 647 ముజాహిదీన్‌ బెటాలియన్‌కు చెందిన ఏడుగురు సైనికులు ఈ దాడిలో హతమయ్యారని వెల్లడించింది. అయితే ఈ ఘటనలో పాకిస్థాన్‌ కు ఎంత నష్టం జరిగిందనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. కాగా, భారత జవాన్లపై చేసిన దాడులపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎప్పుడూ ప్రతీకార చర్యలకు పాల్పడడం కాకుండా, పాకిస్థాన్ కు బుద్ధి వచ్చేలా చేయాలని యువత నినదిస్తోంది.

పదేపదే కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ కవ్విస్తున్న పాక్‌.. ఈ సారి మరీ బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ.. పెట్రోలింగ్‌ చేస్తున్న ఇద్దరు భారత జవాన్లపై దాడి చేసి అత్యంత క్రూరంగా వారి తలలు నరికేసింది. పాక్‌ సైన్యం ఓవైపు సరిహద్దు వెంబడి భారత పోస్టులపై మోర్టార్లతో దాడికి తెగబడగా.. పాక్‌ సరిహద్దు భద్రతా దళం (బీఏటీ) బృందం 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.

ఆదివారం రాత్రి నుంచే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డ పాకిస్తాన్‌ ఆర్మీ‌.. సోమవారం ఉదయం జవాన్లను కిరాతకంగా చంపేసింది. భారత జవాన్ల తలలు నరికిన పాక్‌ ఆర్మీ చర్య అనాగరికమని భారత రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ మండిపడ్డారు. పాకిస్తాన్‌కు పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా పర్యటించి.. కశ్మీర్‌ ఆందోళనలకు తమ మద్దతుంటుందని ప్రకటించిన మరునాడే ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ సైన్యం ఏప్రిల్‌1న పూంచ్‌సెక్టార్లో నాయబ్‌ సుబేదార్‌ ఎస్‌ సన్యైమా సోమ్‌ను ఐఈడీ పేలుడులో హతమార్చింది. మార్చిలో ఇదే సెక్టార్‌లో నాలుగుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించింది. పూంచ్‌లోనే మార్చి9న సైనిక జవాన్‌ దీపక్‌ జగన్నాథ్‌ ఘడ్గేను పాక్‌ సైన్యం హతమార్చింది. 2016లో పాక్‌ సైన్యం 228 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 2015లో 150 సార్లు, 2014లో 150 సార్లు ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత భద్రతా బలగాలు ఈ ఏడాది 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 2016లో 150 మంది ఉగ్రవాదులను, 2015లో 101 మందిని, 2014లో 104 మందిని మట్టుబెట్టాయి.

- Advertisement -