ఘనంగా నెల రోజులపాటు…”బోనాలు”

44
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నెల రోజులపాటు నిర్వహించిన ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగి విజయవంతమయ్యాయి.అత్యంత ప్రాముఖ్యత కలిగిన బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలు ఆషాడం మాసంలో నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరిగాయి.

తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ గడ్డమీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుంది. భారతీయ సాంప్రదాయ సబ్బండ వర్గాల సాంస్కృతిక వేడుకగా తెలంగాణ బోనాల పండుగ ప్రత్యేకతను చాటుకుంటున్న ది.తమ ఆరోగ్యాలను కాపాడుతూ, పంటలను కాపాడుతూ , నీటి చెరువు కట్టలను కాపాడుతూ, రక్షణగా నిలుస్తూ, కష్టాలలో సుఖాలలో తమకు అండగా నిలబడే ప్రకృతి దేవతలను తరతరాలుగా కొలుస్తూ కొనసాగుతున్న ఉత్సవాల్లో బోనాల పండుగ ప్రముఖమైంది.

ప్రకృతి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ తదితర రూపాల్లో ఉన్న అమ్మవారికి ఆషాడ మాసమంతా బోనాలు సమర్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటారు.ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషంగా బోనాల పండుగను జరుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటేలా దేశ రాజధాని ఢిల్లీలో కూడా బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాలతో జూన్ 22వ తారీఖున ప్రారంభమైన బోనాల పండుగ వేడుకలు నేటితో అనగా జూలై 17 తారీఖుతో ముగిసాయి.

బోనాల ప్రారంభం :

తొలుత గోల్కొండ జగదాంబ మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రార్ధించారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం బోనాల ఉత్సవంలో స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల వేడుకల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జోగిని స్వర్ణలత రంగం (భవిష్యవాణి) వినిపించారు. మహంకాళి దేవాలయం, అసంజిమండి, అక్కన్న మాదన్న దేవాలయాల్లో కర్నాటకలోని ధావనగిరి నుంచి తెప్పించిన ఏనుగు అంబారీతో ఊరేగింపును నిర్వహించారు.

బోనాల సందర్భంగా ప్రభుత్వం 28 దేవాలయాల్లో కొలువైన అమ్మవార్లకు రూ. 5 లక్షలు వెచ్చించి పట్టువస్త్రాలు సమర్పించింది. ఆదివారం నాడు ఆషాఢం చివరి రోజు కావడంతో జనపదాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాలతో తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ హోరెత్తింది. అమ్మవారి ఆలయాలన్నీ ఆడపడుచుల బోనాలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. మహిళలు కుటుంబసమేతంగా భక్తితో తమ ఇండ్ల నుంచి బయలుదేరి అమ్మవారికి మొక్కి బోనం సమర్పించారు.

ఓల్డ్ సిటీలోని చారిత్రక లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ప్రతిమను అంబారీపై ఊరేగించారు. తెల్లవారు జాము నుంచే భారీ సంఖ్యలో భక్తులతో పాటు మంత్రులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

బాలాపూర్ నుండి మూసీ నది వరకు జరిగే ఆఖరి రోజు ఘటాల ఉత్సవంలో ఆదివారం నాడు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. పాతబస్తీలోని లాల్ దర్వాజ, అక్కన్నమాదన్న, సబ్జిమండి, మీరాలం మండి, చార్మినార్ భాగ్యలక్ష్మి, ఉప్పుగూడ మహంకాళి, భరతమాత, హరిబౌలి, బంగారు మైసమ్మ, నాంపల్లిలోని ఏడు గుళ్లు, గౌలిగూడ, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Also Read:వైసీపీలో వర్గ ” పోరు “..?

రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ లోని 1073 దేవాలయాలకు, సికింద్రాబాద్ లో 1076, రంగారెడ్డి జిల్లాలో 364, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 523…. మొత్తం 3036 దేవాలయాలకు మరమ్మతులు, రంగులు, విద్యుత్ అలంకరణ కోసం ఈ నిధులను ఖర్చు చేశారు. అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్చర్, టూరిజం, ఐ అండ్ పీఆర్, ఆర్కియాలజి, జీహెచ్ఎంసీ, సివరేజి బోర్డు, ఎలక్ట్రిక్, దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో, హెచ్ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి, సివిల్ సప్లైస్, టిఎస్ ఆర్టీసి, రైల్వే, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లను చేశారు. దేవాలయాలను చక్కగా అలంకరించారు.

తెలంగాణ పోలీస్, షీ టీమ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. బోనాలు సమర్పించేందుకు మహిళా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సబ్బండవర్ణాలు పెద్దఎత్తున తరలిరావడంతో అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. తెలంగాణ సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మకత ఉట్టిపడింది. గోల్కొండలో మొదటి బోనంతో ప్రారంభమైన ఆషాఢ బోనాల జాతర నేటితో (జులై 17 సోమవారం ) ముగిసింది.

Also Read:బీజేపీతో కలవడమా..నో ఛాన్స్!

- Advertisement -