మనం నిత్యం వంటింట్లో వాడే మసాలా దినుసుల్లో దనియాలు కూడా ఒకటి. కొత్తిమీర గింజలనే దనియాలు అంటారు. ఇవి కూరల రుచిని రెట్టింపు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. దనియాలు కేవలం కూరల రుచిని పెంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలుగజేస్తాయి. దనియాల పొడిని రెగ్యులర్ గా కూరల్లో చేర్చుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తపోటును నియత్రించడంలో కూడా దనియాలు సహాయపడతాయి. దనియాల పొడిని కషాయంలో చేసుకొని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దనియాలలో విటమిన్ కె, విటమిన్ ఏ, పొటాషియం, వంటి పోషకాలతో పాటు.. ఫైబర్, ఐరన్, కాల్షియం వంటివి కూడా అధికంగానే ఉంటాయి.
ఇవన్నీ వివిధ రకాలుగా ఆరోగ్యానికి సహకరిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఇక దనియాలను రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి దనియాల పొడి కషాయం చక్కటి పరిష్కారంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఆందోళన, ఒత్తిడి, వంటి కారణాల వల్ల కొంతమందిలో జుట్టు అధికంగా రాలిపోతుంది. అలాంటి వారు దనియాల పొడిలో కొద్దిగా తేనె కలుపుకొని సేవిస్తే మంచిదట. ఇక దనియాల కషాయం ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మహిళల్లో వచ్చే ఋతుక్రమ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దనియాలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దనియాల పట్ల నిర్లక్ష్యం వద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఇవి పాటిస్తే మీ ఆరోగ్యం పదిలం..