రాఘవాపురానికి తన నిధుల నుంచి కోటి రూపాయాలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ కోటి రూపాయాలతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలకు సూచించారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రాఘవాపురంలో పర్యటించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రూ.14 కోట్ల స్త్రీనిధి రుణాలు, రూ.కోటి 22 లక్షల విలువైన ట్రాక్టర్లు, ఎక్సైజ్, ఎస్సీ కార్పొరేషన్ రుణాల చెక్కులు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. రాఘవాపురానికి ఇప్పటికే 30 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశాం.. మళ్లీ మరో 30 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే నిర్ణయంతోనే అందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లిలాగే రాఘవాపురంలోని కుటుంబాలందరికీ పాడి పశువులను కొనిస్తామని పేర్కొన్నారు. మీరు కోరుకున్న పాడి పశువులను మీ కలెక్టర్ కొనిస్తారని తెలిపారు. గంగదేవిపల్లి మార్గంలో ఐకమత్యంగా పయనించడం శుభపరిణామమని చెప్పారు. గంగదేవిపల్లిని మించిన గ్రామంగా రాఘవాపురంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామస్తులంతా ఒకే మాటమీద నిలబడి అభివృద్ధి దిశగా పయనించాలని పిలుపునిచ్చారు.