సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులన్నీ సొంతం చేసుకుని దూసుకుపోతున్న ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ తన ఖాతాలో మరో రికార్డును వేసుకుంది. రీఎంట్రీతో రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఓవరాల్ కలెక్షన్లను, ప్రీ బుకింగ్స్ తోనే ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ కొల్లగొట్టడం విశేషం.
అమెరికాలో ఖైదీ నెంబర్ 150 సినిమా 2.45 మిలియన్ డాలర్లు (15 కోట్ల 70 లక్షల రూపాయలు) వసూలు చేయగా, ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో ఏకంగా 3 మిలియన్ డాలర్ల (దాదాపు 19 కోట్ల రూపాయలు) వసూళ్లు రాబట్టిందని ఆ దేశంలో ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. రికార్డు స్థాయిలో యూఎస్ లో గంటలకు 64 లక్షల రూపాయల విలువ చేసే టికెట్స్ బుక్ అవుతున్నాయని వారు వెల్లడించారు.
మరోవైపు బాహుబలి-2 సినిమా విడుదలకు ముందే భారీ వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రా ఏరియా హక్కుల్ని 50 కోట్ల రూపాయల నుంచి 55 కోట్ల రూపాయలకు.. అమ్ముడు పోయినట్టు సమాచారం.. వైజాగ్ ఏరియా ఒక్కటే 12 కోట్ల రూపాయలకు.. సీడెడ్ ఏరియా 22 కోట్ల రూపాయలకు.. ఈ రెండు ఏరియాలను వారాహి చలనచిత్రం అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి కొన్నారు. అంతే కాకుండా కృష్ణా జిల్లా రైట్స్ ను కూడా, బాహుబలి నిర్మాతలతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం ద్వారా (లాభాల్లో పంపకాలు) 9 కోట్ల రూపాయలకు ఆయనే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నైజామ్ రైట్స్ 40 కోట్ల రూపాయలకు పైగా రికవరబుల్ అడ్వాన్స్ తీసుకుని, తక్కువ కమిషన్ (దాదాపు 4 శాతం) మీద డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకుంటుండడం విశేషం.
ఇక సినిమా హక్కులను రెండు పార్ట్ లూ కలిపి 28 కోట్ల రూపాయలకు ‘మా’ టీవీ (ఇప్పటి ‘స్టార్ మా’ టీవీ) కి అమ్మేశారు. దీంతో అవుట్ రైట్ అమ్మకాలు, తీసుకున్న అడ్వాన్సులు, శాటిలైట్ రైట్ల లెక్కల ప్రకారం ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ తెలుగు వెర్షన్ ఒక్కదానికే 175 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మలయాళం హక్కులను 6 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల మధ్యలో అమ్మగా, తమిళ, హిందీ వెర్షన్ లను కూడా భారీ ఎత్తున అమ్మినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ సినిమా విడుదలకు ముందే వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది.