రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్,డీజీల్,గ్యాస్,నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చమురు ధరల పెంపుతో హైదరాబాద్లో డీజీల్ ధర సెంచరీ దాటగా తాజాగా వాహనదారులకు మరో చేదు వార్త.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలను 5 నుంచి 10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించినట్టు తెలుస్తోంది. కారు, జీపులు వంటి వాహనాలపై 5 నుంచి 10 రూపాయలు, బస్సులు, లారీలకు 15 నుంచి 25 రూపాయలు, భారీ వాహనాలకు 40నుంచి 50 రూపాయల వరకు టోల్ రుసుం పెరగనుంది.
రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి 57 టోల్ ప్లాజాలున్నాయి. ఏడాదికి 2వేల 400 కోట్ల రూపాయల టోల్ వసూల్ అవుతుండగా తాజా పెంపుదలతో మరింత పెరగనుంది. సాధారణంగా టోల్ చార్జీలను ఏడాదికోసారి సవరిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు, ఆయా రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య, గతంలో వసూలైన రుసుముల ఆధారంగా ధరలను సవరిస్తారు. ఈ ప్రతిపాదనను కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ఎన్హెచ్ఏఐ పంపుతుంది. దీనిపై ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఈ నెలాఖరు నాటికి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..