ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ అజాన్ (తెల్లవారు జామున ముస్లింలు చేసే నమాజ్)పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ద్వారా ‘‘అందరినీ దేవుడు మంచిగా చూడాలి. నేను ముస్లింను కాను. కానీ, ప్రతి రోజూ తెల్లవారగానే అజాన్‌తో నిద్ర లేస్తున్నాను. ఎప్పుడూ ఈ బలవంతపు మతతత్వం అంతమవుతుందో ఏమోనని మతంపై తన అభిప్రాయాన్ని షేర్ చేశాడు. నాకు ఏ గుడిమీద, గురుద్వారా మీద నమ్మకం లేదు. మతం అంటే నమ్మకం లేని వాళ్లను మైకుల ద్వారా నిద్రలేపే గుళ్లన్నా, గోపురాలన్నా నాకు నమ్మకం లేదు. అలాంటప్పుడు ఈ గోలంతా ఎందుకు? నిజమా..? కాదా..? మొత్తంగా.. మతమంటే ఓ గూండాగిరి అంతే..!’’ అంటూ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు మండిపడ్డారు.
తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని మైనారిటీ యునైటెడ్ కౌన్సిల్ చెందిన మౌలావి అనే క్లెరిక్ సోనూనిగమ్పై ఫత్వా జారీ చేశాడు. సోనూ నిగమ్‌కి గుండు గీయించి మెడలో తెగిపోయిన చెప్పుల దండ వేసి దేశం మొత్తం వూరేగిస్తే రూ.పది లక్షల రివార్డు ఇస్తానని పేర్కొన్నారు. దీనికి సోనూనిగమ్ స్పందిస్తూ.. ‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మా ఇంటికి ఆలిమ్ అనే క్షురకుడు వచ్చి నాకు గుండు గీస్తాడు. మౌలావి.. మీరు రూ.పది లక్షలు సిద్ధంగా ఉంచుకోండి. మా ఇంటికి మీడియా కూడా రావచ్చు’ అని ట్వీట్ చేశాడు. తాను ప్రకటించినట్టు గుండు కూడా చేయించుకున్నాడు సోనూ నిగమ్. గుండు కొట్టించుకోవడం అన్నది సవాలో లేక దీనిని నెగటివ్‌గా తీసుకోవడమో ఏమీ లేదుగానీ.. ఈ ఫత్వాలు ఏంటి? అసలు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అని సోను నిగమ్ ప్రశ్నించాడు. ఇలాంటి అతివాదులతో నేరుగానే పోరాడాలని, ట్విట్టర్లో కామెంట్లు చేయడం వల్ల ప్రయోజనం లేదని అన్నాడు.
కాగా, బాలీవుడ్ ప్రముఖుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సోనూ నిగమ్ వీరాభిమానులు కూడా ఇది తప్పంటున్నారు. వ్యక్తిగత విశ్వాసమైన మతం గురించి ఇలా మాట్లాడటం సరికాదని హితవు చెబుతున్నారు. మరికొందరు సోనూకి ఇంత దూకుడు పనికిరాదని తీవ్రంగా విమర్శిస్తున్నారు.