నరాల బలహీనత ఉందా..ఈ ఆసనం వేయండి!

72
- Advertisement -

మెదడు నుంచి సంకేతాలను శరీరానికి చేరవేయడంలో నరాలు కీలక పాత్ర వహిస్తాయి. అందుకే నాడీ వ్యవస్థ మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది. నాడీవ్యవస్థ బలహీన పడితే.. దాని ప్రభావం శరీరంలోని అన్నీ అవయవలపై పడుతుంది. నరాల బలహీనత అనేది చిన్న సమస్య కాదు. దీన్ని వల్ల శరీరంలో తిమ్మిర్లు రావడం, మాట్లాడడంలో తడబడడం, ఏదైనా చిన్న విషయానికి వణుకు రావడం, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. నరాల బలహీనత ఉన్నవారికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు చెబుతుంటారు. అయితే నరాల బలహీనతకు యోగాలో కొన్ని ఆసనాలు చక్కటి పరిష్కారం చూపుతాయి. వాటిలో పశ్చిమొత్తానాసనం ఒకటి. ఈ ఆసనం శరీరంలోని నాడీ వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందువల్ల నరాల బలహీనత వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా ఈ ఆసనం వేయడం వల్ల కాళ్ళకు వెన్నెముకకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా కాళ్ళు వెన్నెముక దృఢంగా తయారవుతాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంతో పాటు అడ్రినల్, సెక్స్ గ్రంధులను ఉత్తేజపరుస్తుంది.

పశ్చిమొత్తానాసనం వేయు విధానం

ముందుగా నేలపై కూర్చొని వెన్నెముకను నిటారుగా ఉంచి కాళ్ళను సమాంతరంగా ముందుకు చాపాలి. ఆ తరువాత చేతులతో కాళ్ళ యొక్క వేళ్ళు పట్టుకొని మోచేతులను ఫోటోలో చూపిన విధంగా కాళ్ళకు ఇరు వైపులా నెలకు ఆనించి, నడుము భాగాన్ని కిందకి వంచుతూ తలను మోకాళ్ళకు ఆనించాలి. ఆ సమయంలో మోకాళ్ళను పైకి లేపకుండా నేలకు ఆనే విధంగా చూసుకోవాలి. వెన్నెముక వీలైనంతా నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా వీలైనంత సమయంలో ఈ ఆసనం వేయాలి.

జాగ్రత్తలు

అధిక వెన్నునొప్పి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆసనం వేయరాదు. కీళ్ల సమస్యలు, డయేరియా, ఆస్తమా వంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేయకపోవడమే మంచిది. గర్భిణీ స్త్రీలు ఈ ఆసనం వేసేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి.

Also Read:ఆకట్టుకుంటున్న జనక అయితే గనక..లిరికల్

- Advertisement -