ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీకి సంబంధించిన చర్చ జోరుగా జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన ఏపీ ప్రజానీకం.. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే గడిచిన ఈ మూడున్నర ఏళ్లలో వైఎస్ జగన్ పాలనపై సానుకూలత ఏ స్థాయిలో ఉందో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఏర్పడిందనే చెప్పవచ్చు. సంక్షేమం విషయంలో ఎన్నో లెక్కకు మించిన పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజల ఖాతాల్లోకి నేరుగా నగదు పంపిణీ చేస్తున్న జగన్.. అభివృద్ది విషయాన్ని మాత్రం గాలికి వదిలేశారనే విమర్శ ప్రధానంగా విన్పిస్తోంది. .
ముఖ్యంగా రోడ్ల దుస్థితి విషయంలోనూ, నిత్యవసర ధరల విషయంలోనూ జగన్ పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో ఇసుక మాఫియా, అవినీతి ఆరోపణలు, నిరుద్యోగ సమస్య, రాజధాని రాజకీయాలు ఇలా ఎన్నో సమస్యలు జగన్ పరిపాలనను వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. ఇక మరోవైపు జగన్ క్యాబినెట్ లోని పలువురి మంత్రుల వ్యవహార శైలి కూడా ప్రజల్లో వైసీపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ఉందనేది కొందరి అభిప్రాయం. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆర్కే రోజా వంటి మంత్రుల భాష తీరుపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పాలనపై సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువ కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గద్దె దించుతారా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పడతారని విపక్షాలు కాన్ఫిడెన్స్ తో ఉన్నాయి. టీడీపీ, జనసేన పార్టీలతో పాటు బీజేపీ కూడా వైసీపీపై ఉన్న వ్యతిరేకత ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి. బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఇటీవల స్పందిస్తూ.. జగన్ ప్రభుత్వం అన్నీ రంగాల్లోనూ విఫలం అయిందని, పరిపాలన వ్యవస్థ అత్యంత దయనీయంగా మారిందని చెప్పుకొచ్చారు. కేంద్రం నిధులిస్తున్న సద్వినియోగం చేసుకోలేని స్థితిలో సిఎం జగన్ ఉన్నారని.. తన పరిపాలన అసమర్థతను కేంద్రంపై నేట్టేందుకు జగన్ చూస్తున్నారని జీవిఎల్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ప్రజలు గద్దె దించడం ఖాయంగా ఉందని చెప్పుకొచ్చారు. మరి జగన్ పరిపాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..