పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం..

162
- Advertisement -

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని ప్రధమ కర్తవ్యంగా మారినప్పుడే మానవాళి మనుగడకు ముప్పులేకుండా ఉంటుందని తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. దేశాన్ని పీడిస్తున్న అనేక సమస్యల్లో పర్యావరణం దెబ్బతినటం ముఖ్యమైనదని చెప్పారు. బుధవారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్లోని విశ్వకర్మ ఆత్మగౌరవ భవన ప్రాంగణంలో జూలూరు జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక దృష్టితో 270 కోట్ల మొక్కలను నాటటం జరిగిందన్నారు. రాష్ట్రంలో 5 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఆచరణాత్మక చర్యలు దేశానికే దిక్సూచిగా మారాయని పేర్కొన్నారు.

ప్రపంచ పర్యావరణ పరిరక్షకురాలు గ్రేటాథెన్ బర్గ్ స్వీడిష్ పార్లమెంట్ ముందు సుదీర్ఘకాలం నిరంతర ధర్నాలు చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించారని గుర్తు చేశారు. ఆమె చేసిన ఉద్యమానికి స్వీడిష్ పార్లమెంట్ పరిరక్షణ చేపట్టిందన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సులో “మీకెంత ధైర్యం” అంటూ థెన్ బర్గ్ లేవనెత్తిన ప్రశ్న దేశదేశాల నేతలను కదిలించిందన్నారు.

థెన్ బర్గ్ స్వీడీష్ పార్లమెంట్ ముందు ధర్నాలు చేస్తూ పర్యావరణ ఉద్యమం చేపడితే భారత పార్లమెంట్లో వున్న ఎం.పి. జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం చేపట్టి దాని నేతృత్వంలో 16 కోట్ల మొక్కలను నాటించడం దేశ పర్యావరణ ఉద్యమంలో గొప్ప మలుపుగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చపచ్చని పర్యావరణ వెలుగులు విరజిమ్మే రాష్ట్రంగా వర్ధిల్లటానికి ప్రతి ఒక్కరం ఒక మొక్కనాటి దానిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని జూలూరు గౌరీశంకర్ కోరారు.

ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్ట్ ఛైర్మన్ లాలో కోట వెంకటాచారి, సెక్రటరీ బొడ్డుపల్లి సుందర్, వైస్ ఛైర్మన్ వేములవాడ మదన్మోహన్, కార్యవర్గ సభ్యులు దానకర్ణాచారి, ఎర్రోజు వేణుగోపాల్, సాహిత్య అకాడమి కార్యదర్శి డా. ఎన్. బాలాచారి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

దివ్యాంగుల సంక్షేమమే తెలంగాణ లక్ష్యం..

టీఎస్ఆర్‌టీసీలో లహరి బస్సులు…

‘శలభాసనం’ వేస్తే ఇన్ని ఉపయోగాలా !

- Advertisement -