టీ20లో భారత్‌ రెండవ విజయం

278
- Advertisement -

ఆస్ట్రేలియా వేదికగా జరిగే 2022వ వరల్డ్‌కప్‌ టీ20లో భారత్‌ రెండవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ గ్రూప్‌2లోని నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 56పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ దిగిన నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179పరుగులు చేసింది.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు హాఫ్‌ సెంచరీలతో హోరెత్తించారు. నిజానికి సిడ్నీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించదు. ఆరంభంలో బ్యాటర్లు కష్టపడ్డారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కేవలం 9 రన్స్‌కే వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ, రోహిత్‌(53)లు రెండు వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈసారి కోహ్లీ తన క్లాసిక్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కోహ్లీ, రోహిత్‌లు రెండో వికెట్‌కు 73 రన్స్‌ జోడించారు. ఇక మూడవ వికెట్‌కు కోహ్లీ, సూర్యకుమార్‌లు అజేయంగా 106 రన్స్‌ జోడించారు.

విరాట్ కోహ్లీ వరుసగా రెండవ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ 44 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా భారీ షాట్లతో అలరించాడు. అతను వేగంగా స్కోర్‌ బోర్డును పరుగెత్తించాడు. సూర్యకుమార్‌ కేవలం 25 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 రన్స్‌ మాత్రమే చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, హర్షదీప్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఈ విక్టరీతో గ్రూప్‌ 2లో ఇండియా నాలుగు పాయింట్లతో ప్రస్తుతం టాప్‌లో నిలిచింది. ఒక్కొ గ్రూపు నుంచి టాప్‌ రెండు జట్లు మాత్రమే సెమీస్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

మరోసారి తలపడనున్న దాయాదులు!

ఆకాశమే నీకు హద్దుగా సాగిపో

అందరి మ్యాచ్‌ ఫీజు సమానం

- Advertisement -