మునుగోడులో డ్రామాలు మొదలుపెట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు డ్రామా రాజకీయాలు చేయడం మొదలు పెట్టాయని అన్నారు. ప్రజల సానుభూతి కోసం చేతికి పట్టీలు కట్టుకునే సమయం వచ్చిందన్నారు. దుబ్బాక హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ప్రజలను ఇలాగే మోసం గెలిచారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పోరాడలేక బీజేపీ నాయకులు ప్రజల సానుభూతి కోసం డ్రామాలు మొదలుపెట్టారని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ను పూర్తిగా నాశనం చేశామని అన్నారు. మునుగోడు ప్రజలు కాంగ్రెస్, బీజేపీల సానుభూతి డ్రామాలు నమ్మవద్దని, నమ్మితే నష్టపోతారని మంత్రి హెచ్చరించారు. వచ్చే సాధారణ ఎన్నికల లోపు మునుగోడు అభివృద్ధిలో మార్పు చూపించకపోతే అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులు వాళ్లపై వాళ్లే దాడులు చేయించుకుని ఏడుస్తారని మంత్రి ఆరోపించారు. ఓటర్ల సానుభూతి కోసం బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి జ్వరం డ్రామా ఆడుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ఏడుస్తూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి తలసాని విమర్శించారు.
మునుగోడు పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ఇక సెంటిమెంట్ రగిలించడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెడుతుందని మంత్రి ఆరోపించారు. అయితే, తాము కాంట్రాక్టర్ల కోసం రాజకీయం చేసే వాళ్ళం కాదని, కుట్రలు, కుతంత్రాలు తమకు అవసరం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా మునుగోడులో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. మునుగోడులో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అన్ని పథకాలు ఎలా అందాయో చెప్పాలని డిమాండ్ చేశారు.