కేంద్రానికి నివేదించిన ఐ.బి?
మునుగోడులో జాతీయనేతల పర్యటనలు
బి.జె.పి.కంటే టి.ఆర్.ఎస్.ముందుంది
బండి పనిచేయలేదని కేంద్రానికి ఐబి నివేదిక
బండికి బి.జె.పి. అధిష్టానం క్లాస్
రాజగోపాల్ రెడ్డికి బిజెపి కేడర్ దూరం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బి.జె.పి. వెనుకబడిపోయిందని ఇంటెలిజెన్స్ విభాగం (ఐ.బి.) కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంపెద్దలకు నివేదించిందని, అందులో భాగంగానే కమలం పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అందులో భాగంగానే బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను బుధవారం నాడు న్యూఢిల్లీకి పిలిపించుకొన్న అధిష్టానం పెద్దలు క్లాస్ పీకినట్లు తెలిసింది. మునుగోడు ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనడంలోగానీ, వ్యూహాలు రచించడంలో స్థానిక బి.జె.పి.నాయకులు వైఫల్యం చెందినట్లుగా ఐ.బి.వర్గాలు కమలం పార్టీ జాతీయ నాయకత్వానికి ఇన్‌పుట్ అందించినట్లు తెలిసింది. ఓటర్లను ఆకట్టుకోవడంలోనూ, రాజకీయ వ్యూహాలను రచించడంలోనూ, ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనడంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) ముందుందని కూడా ఐ.బి.వర్గాలు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
అంతేగాక టి.ఆర్.ఎస్.ను వ్యతిరేకించే ఓటర్లు బి.జె.పి.వైపు రాకుండా కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని, దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా బలపడిందని ఐ.బి.వర్గాలు గుర్తించాయి. దీనికి ప్రధాన కారణం బండి సంజయ్ ఇప్పటి వరకూ మునుగోడులో పెద్దగా పనిచేయలేదని కూడా ఐ.బి.నిర్మొహమాటంగా బి.జె.పి.
జాతీయ కార్యవర్గానికి సమాచారాన్ని చేరవేసింది. అంతేగాక బండి సంజయ్ పాదయాత్ర చేయడంతో రాష్ట్రంలో తన సొంత ఇమేజ్ ను నిర్మించుకోవడంపైనే ఎక్కువగా దృష్టిసారించారని కూడా ఐ.బి.నివేదించినట్లు తెలిసింది. కేవలం నామినేషన్ దాఖలుచేసే సమయంలోనే బండి సంజయ్ మునుగోడుకు వెళ్ళారని, ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో బి.జె.పి. శ్రేణులు ఏమి చేస్తున్నారో కూడా ఆయన పట్టించుకోలేదని కూడా ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇదంతా ఒక ఎత్తయితే మునుగోడు బి.జె.పి. ఎమ్మెల్యే అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పనితీరు, ఆయన వ్యవహారశైలి నచ్చని కమలంపార్టీ ఒరిజినల్ కేడర్ (పాతవారు) ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లుగా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి.
ఆశ్చర్యకరంగా రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఉన్న నిరక్షరాస్యులైన ఓటర్లు ఇప్పటికీ ఆయన ఎనికల గుర్తు చెయ్యి అని, కమలం కాదు అని భావిస్తున్నారని కూడా ఐ.బి.దృష్టికి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా వరకూ సహాయపడవచ్చునని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అందుకేనేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బి.జె.పి.కేడర్ పైన నమ్మకం పెట్టుకోకుండా నల్గొండ పట్టణానికి చెందిన తన సొంత కార్యకర్తలనే వెంటబెట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ ప్రాక్టికల్ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికే బండి సంజయ్ ను బుధవారం సాయంత్రం హుటాహుటిన న్యూఢిల్లీకి పిలిపించుకొని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని, అందుకు తగినట్లుగా తీసుకోవాల్సిన చర్యలపై బండికి జాతీయ నాయక్వం హితబోధ చేసినట్లు తెలిసింది. ఉప ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడుగా పాల్గొనాలని పార్టీ నాయకత్వం కోరుతోందని న్యూఢిల్లీ పెద్దలు బండి సంజయ్ ను ఆదేశించినట్లు తెలిసింది.
మరో పది రోజుల్లో బి.జె.పి. జాతీయ అగ్రనేతలందరూ ఒకరి తర్వాత మరొకరు మునుగోడులో ప్రచారాన్ని వేగవంతం చేస్తారని కమలం పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు వివరించారు. జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా మునుగోడులో పర్యటించి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. లేకుంటే గెలవడం చాలా కష్టమని ఐ.బి. అధికారులు నివేదించిన తర్వాత బి.జె.పి.అధిష్టానం రియలైజ్ అయ్యిందని కొందరు సీనియర్ నాయకులు వివరించారు. అంతేగాక అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్.పార్టీ గడచిన ఏడున్నరేళ్ళ కాంలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసిందని, నిండు వేసవిలో కూడా చెరువుల్లో నీరు కనిపిస్తోందని, ఏడాదికి రెండు పంటలను పండిస్తున్నారని, మునుగోడు నియోజకవర్గం లాంటి ఫోరిన్ పీడిత గ్రామాల్లో రక్షిత మంచినీటిని సరఫరా చేసి దశాబ్దాల సమస్యను పరిష్కరించిందని, అంతేగాక డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను చేపట్టిందని, ఇక రైతుబంధు, రైతు భీమా, దళితబంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో పథకాలు ప్రజల మనసులను గెలుచుకొన్నాయని కూడా ఐ.బి. నివేదించిందని ఆ వర్గాలు వివరించాయి. దీనికితోడు కమ్యూనిస్టు పార్టీలకు ఒకప్పడు మునుగోడు నియోజకవర్గం కంచుకోట వంటిదని, ఈ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల బ్లీ అధికార టి.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్ధిని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాయని కూడా ఐ.బి. అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అందుకే బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు బండ సంజయ్ ఉమార్ మునుగోడు ఉప ఎన్నికలకు మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఇన్ చార్జిలను నియమించారు.
మండల ఇన్ చార్జిల నియామకాలు జరిగాయని ఉప ఎనికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఒక్కో మండలానికి ఇన్ చార్జి, ఇద్దరు సహ ఇన్ చార్జిల చొప్పన నియమిస్తూ మొత్తం ఎనిమిది మండలాలకు 24 మంది నాయకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి అధిష్టానం క్లాస్ పీకడంతో అధ్యక్షుడు బండ సంజయ్ శుక్రవారం నుంచి మునుగోడు ఉప ఎన్నికలపైన దృష్టి సారించారని ఆ నాయకులు వివరించారు.
రానున్న పది రోజుల్లో మొత్తం 14 సభలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రి బాబూ మోహన్, డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు వేర్వేరుగా సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి చెందిన నాయకులే కాకుండా జాతీయస్థాయి నాయకులు కూడా మునుగోడులో పర్యటించనున్నారని వివరించారు. లేటుగానైనా బి.జె.పి.అధిష్టానం రియలైజ్ అయ్యిందని, వీరి పర్యటనల ప్రభావం మునుగోడు ఫలితాలపై ఎలా ఉంటుందో వేచి చూడాలి…