మునుగోడు గెలుపు కోసం అందరూ కృషి చేయాలి: సీఎం

111
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో మునుగోడు నాయకులతో భేటీ ఆయిన సీఎం… ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్‌ విజ‌యానికి అంద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ‌యానికి కృషి చేయాల‌ని టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్, ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్‌కు కేసీఆర్ సూచించారు. భ‌విష్య‌త్‌లో జాతీయ‌, రాష్ట్ర రాజ‌కీయాల్లో నేత‌లంద‌రికీ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని సీఎం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సూచ‌న మేర‌కు కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామ‌ని న‌ర్స‌య్య గౌడ్, ప్ర‌భాక‌ర్ తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 2003 నుంచి టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తెలంగాణలో జరిగిన పలు ఉపఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో పరాజయంపాలయ్యారు. అప్పటినుంచి మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమయింది.

- Advertisement -