చదువు కేవలం విజ్ఞానాన్నే కాదు విశేషమైన జీవితాన్ని కూడా ఇవ్వాలన్నారు ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఖాజాగూడ చిత్రపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కైరో (అవకాశం) అనే గ్లోబల్ స్కూల్‌ని మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, చదువంటే కేవలం విజ్ఞానాన్ని పెంచుకోవడమే కాదన్నారు. అద్భుతమైన, ఉన్నతమైన జీవితాన్ని కూడా ఇచ్చే విధంగా ఉండాలన్నారు. చదువుకోవడం నుంచి చదువు కొనే దిశగా విద్యా రంగం కొనసాగుతోందన్నారు. ఈ పరిస్థితిలో విద్య అంటే వ్యాపారమనే దుస్థితి ఏర్పడుతున్నదన్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే విద్య ప్రాధాన్యాన్ని గుర్తెరిగి గ్లోబల్ స్థాయిలో విద్యార్థులని తీర్చిదిద్దే విధంగా బోధన సాగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాలయాల ఏర్పాటు వ్యయం బాగా పెరిగిందన్నారు. అందువల్ల మంచి టీచర్ రావాలంటే మంచి జీత భత్యాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ దశలో విద్యా బోధన-విద్యా సంస్థల ఏర్పాటు కత్తి మీద సాములా మారిందన్న విషయం అందరూ అంగీకరించాల్సిందేనన్నారు కెటిఆర్. విద్యా ప్రమాణాలతో రాజీ పడకుండా, సేవా దృక్పథాన్ని వీడకుండా విద్య-వ్యాపారాల మధ్య సమతూకం, సమన్వయం పాటిస్తూ, ఫీజుల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని ఉద్చోధించారు. ఎప్పటికీ విద్యని మంచి ప్రమాణాలతోనే అందించాలన్నారు. ఈ ఉన్నత ప్రమాణాల స్థాపనలో కైరో గ్లోబల్ స్కూల్ తన వంతు పాత్ర నిర్వహిస్తుందన్న నమ్మకాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ బడి బాటని ప్రారంభిస్తున్న రోజునే, కైరో స్కూల్‌ని ప్రారంభించడం సంతోషదాయకం అన్నారు.
సీఎం కెసిఆర్ నేతృత్వంలో, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అనుభవంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వ విద్యని నడిపిస్తోందన్నారు కెటిఆర్. 500 లకు పైగా రెడిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పి అందరికీ విద్యనందిస్తున్నదన్నారు. కేవలం ప్రభుత్వమే మొత్తం విద్యా వ్యవస్థని నడపగలిగినా, ఇప్పటికే ఏర్పడ్డ అనేకానేక ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్స్, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ విద్యని ప్రోత్సహిస్తూనే, ప్రైవేట్‌కి ధీటుగా ప్రభుత్వ విద్యని కూడా అందిస్తున్నామని మంత్రి చెప్పారు.
చిత్ర రంగం విచిత్రమైనదన్నారు కెటిఆర్. ఇక్కడ బల్లు ఓడలు, ఓడలు బళ్ళవడం సాధారణం అన్నారు. చిత్ర సీమలో పని చేసే వాళ్ళ జీవితాలు కూడా విచిత్రంగా ఉంటాయని, నిలకడ లేక, ఒడిదొడుకులతో ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో చేతినిండా పని, డబ్బులు, మరికొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఇక్కడ సర్వ సాధారణం అన్నారు కెటిఆర్. వీటిని దృష్టిలోపెట్టుకుని, చిత్రపురి కాలనీలోనే కైరో గ్లోబల్ స్కూల్ పెడుతున్నందున, చిత్రపురి కాలనీ వాసులకి మంచి డిస్కౌంట్ ఇవ్వాలని కైరో గ్లోబల్ స్కూల్ మేనేజ్‌మెంట్‌ని మంత్రి కెటిఆర్ కోరారు. దీంతో వెంటనే స్పందించిన కైరో గ్లోబల్ స్కూల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి , 50శాతం డిస్కౌంట్‌ని ప్రకటించారు. అయితే ఆ డిస్కౌంట్ హామీని ముందే చిత్రపురి సొసైటీకి ఇచ్చినట్లుగా వెంకట్‌రెడ్డి సభకు కరతళా ధ్వనుల మధ్య తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, జిహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబ, ఎంపిపి మల్లేశ్‌గౌడ్, మణికొండ సర్పంచ్ నరేందర్‌రెడ్డి, మణికొండ ఎంపిటిసి రామకృష్ణారెడ్డి, చిత్రపురి సొసైటీ అధ్యక్షుడు కొమర వెంకటేశ్, కార్యదర్శి వినోద్‌బాల, కాదంబరి కిరణ్. కైరో గ్లోబల్ స్కూల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ సుమంతర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కనుప్రియ వాహీ, టీచర్లు, చిత్రపురి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.