తెలంగాణ అంటే బతుకమ్మ పాటల పూదోటల పండుగ. బతుకమ్మను ఆటపాటలతో ఆడిపాడి గంగమ్మ ఒడికి చేర్చే ఆచారం సంప్రదాయం కేవలం తెలంగాణకు మాత్రమే సొంతం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటపాటల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తన దైన శైలిలో యువతను ఉత్సాహంగా నడిపించినవి ఈ పల్లెపాటలు. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగా సందర్భంగా సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో అనే బతుకమ్మ ప్రత్యేక పాటను ఎమ్మెల్సీ కవిత గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్లోని తన ఇంట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పల్లె పాటలు జనాన్ని ముందుకు నడిపించిన తీరును కవిత ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జెన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు.