తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గురువారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
9న మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్‌లో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
10న మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
కాగా నగర వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మళ్లించారు. ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి నల్లగొండ ఎక్స్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులకు పోలీసులు సూచిస్తున్నారు.