కేజీఎఫ్ సినిమాలో ఖాసిం చాచాగా నటించిన యాక్టర్ గుర్తున్నాడా? ఈ పాత్రలో మెప్పించిన ఆ నటుడి పేరు హరీశ్ రాయ్. ప్రస్తుతం ఈయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా తాను గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీశ్ రాయ్ వెల్లడించారు. ప్రస్తుతం క్యాన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందని తెలిపారు.
క్యాన్సర్ కారణంగా తన గొంతు వాచిపోయిందని.. అది కనబడకుండా ఉండాలనే కేజీఎఫ్ సినిమాలో గడ్డం పెంచుకుని కనిపించానని తన ఆరోగ్య పరిస్థితిని హరీశ్ రాయ్ వివరించారు. గత మూడేండ్లుగా తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నానని, కేజీఎఫ్‌లో నటించడానికి ముందే ఈ మహమ్మారి బారిన పడినట్లు బయటపెట్టారు. అయితే ఆ సమయంలో తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఆపరేషన్‌ను కూడా పోస్ట్‌పోన్ చేసుకోవాల్సి వచ్చిందని.. తాను నటించిన సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఎదురుచూడాల్సి వచ్చిందని వాపోయారు. ప్రస్తుతం క్యాన్సర్ నాలుగో స్టేజిలో ఉందని చెప్పుకొచ్చారు. హరీశ్ రాయ్ ప్రస్తుతం కిద్వాయ్ ఆస్పత్రిలో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.
హరీశ్ రాయ్ పరిస్థితి గురించి తెలిసిన ప్రముఖ నటుడు ఆయన వైద్య ఖర్చులు భరిస్తున్నట్లు సమాచారం. ఇక హరీశ్ రాయ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసి కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, దర్శక నిర్మాతలు ఆయనకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.