ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

62
ganesh
- Advertisement -

పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమీషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కోరారు. ఈ నెల 31 న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఎంఏఅండ్‌యూడీ కార్యాలయంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి, అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, సంయుక్త సంచాలకులు డి ఎస్. జగన్, డి శ్రీనివాస్, ఉప సంచాలకులు యాసా.వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు ఎం. యామిని, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ పరంజ్యోతి, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఓ.ఎస్.డి. లు శ్రీనివాస్ రావు, రాధ, హెచ్‌ఎండీఏ, పురపాలక విభాగాల అధికారులకు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

వినాయక నవరాత్రులను మట్టి విగ్రహాలతో అత్యంత వైభవంగా ఇంటింటా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పండుగలను పర్యావరణహితంగా జరుపుకోవటం వలన పిల్లల్లో పర్యావరణము పట్ల అవగాహన, చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2017 నుంచి మట్టి వినాయక విగ్రహాలను హెచ్‌ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నదన్నారు. ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని 2017 లో 30 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తే, 2022 లో 2 లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్‌ఎండీఏ ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.

నగరవ్యాప్తంగా 39 లొకేషన్స్ తో పాటు 1 మొబైల్ వెహికల్స్ & 5 రెసిడెన్సీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా ఈ నెల 25 నుంచి 30 వరకు హెచ్‌ఎండీఏ ద్వారా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 29 & 30 తేదీల్లో మాదాపూర్ మైండ్ స్పేస్, పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీ ఆఫీస్, కోటక్ మహీంద్రా బ్యాంకు, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, హెచ్‌జీసీఎల్‌ ఆఫీస్ ల వద్ద మట్టి వినాయక విగ్రహాలను హెచ్‌ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. అలాగే ఈ నెల 29 & 30 తేదీల్లో మొబైల్ వెహికల్స్ ద్వారా మియాపూర్ లోని ఎస్‌ఎంఆర్‌ వినయ్, మై హోం జూవెల్ పైప్ లైన్ రోడ్‌, ఇతర గేటెడ్ కమ్మ్యూనిటీస్, ఇందు ఫార్ట్చున్ పరిసర ప్రాంతాలు, కూకట్‌పల్లి, కె పి హెచ్ బి, మలేషియన్ టౌన్ షిప్ లలో పంపిణీ చేస్తమని ప్రకటించారు. మరో 5 ప్రాంతాల్లో రెసిడెన్సీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తామని హెచ్‌ఎండీఏ తెలిపింది. విగ్రహాల పంపిణికి, పర్యవేక్షణకు ప్రాంతాలు వారిగా ఇంచార్జి అధికారులను కూడా నియమించామని తెలిపారు.

- Advertisement -