దేశవ్యాప్తంగా రేప్ ఘటనలు పెరిగిపోతున్నవేళ వాటిని నిరోధించే చట్టాలు కూడా కఠినంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జూబ్లీహిల్స్ ఘటన కేసులో రేపిస్టులను శరవేగంగా అరెస్టు చేశామన్నారు. ఆ నిందితుల్ని జైలుకు కూడా పంపినట్లు మంత్రి తెలిపారు. అయితే 45 రోజుల తర్వాత హైకోర్టు ఆ రేపిస్టులకు బెయిల్ మంజూరీ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చట్టం ప్రకారం రేపిస్టులకు శిక్షపడే వరకు తమ ప్రభుత్వం పోరాడుతుందని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ రేప్ ఘటనను తన ట్విట్టర్‌లో ప్రస్తావించిన మంత్రి కేటీఆర్.. జువైనెల్ చట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్నట్లు వెల్లడించారు. అందుకే రేపిస్టులకు బెయిల్ ఇవ్వకుండా పకడ్బందీ చట్టాన్ని తయారు చేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి తుదిశ్వాస విడిచే వరకు జైలులో ఉండాలన్నారు. జీవిత ఖైదు శిక్షను నిజమైన రీతిలో అమలు చేయాలని మంత్రి తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.