తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో 75 వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు లండన్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయ కుటంబాల ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాని అందించడం జరిగిందని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటింటికి జెండా పంపిణీ చేసి ప్రజల్లో నూతన స్ఫూర్తిని ఉత్తేజాన్ని నింపారని సీఎం కేసీఆర్‌ను ప్రవాసులంతా ప్రశంశించారు. అదే స్పూర్తితో లండన్ లో సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అన్ని కార్యక్రమాల్లో ముందుండే ప్రవాసులు, 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నామని ఎన్నారై టిఆర్ఎస్ యు.కె. అద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
అడ్వైజరీ బోర్డు మెంబర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ భారతీయుడికి 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదని… దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క మధురానుభూతులను పంచేదని వెల్ఫేర్ అండ్ మెంబర్ షిప్ సెక్రటరీ రవి ప్రదీప్ పులుసు అన్నారు.
అధికార ప్రతినిధి హరిగౌడ్ నవాపేట్ మాట్లాడుతూ మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలమని… అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర యోధులు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో… ఆ కలలను మనమందరం సాకారం చేయాలని ప్రతినబూనారు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చెయ్యడం మన బాధ్యత అని అందరికీ గుర్తు చేస్తునట్టు హరిగౌడ్ తెలిపారు.
సంయుక్త కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టె ముక్కల మాట్లాడుతూ, అహింసా మార్గాన్ని ఎంచుకొని గాంధీజీ ఎలాగైతే స్వాతంత్య్రాన్ని సాధించారో అదే బాటలో నడిచి సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పల్లెలు పట్టణాలు ప్రగతి పథంలో ముందుకు నడుస్తుందని… రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది బంగారు తెలంగాణగా మారిందన్నారు. అనేక రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారని… ఒకప్పటి తెలంగాణ పరిస్థితి, ప్రస్తుత తెలంగాణ పరిస్థితి మధ్య చాలా వ్యత్యాసం ఉందని అందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
కార్యదర్శి రవి రేతినేని మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించుకునే క్రమంలో మన పూర్వీకులు అనేక పోరాటాలు చేసారన్నారు. ఎందరో దేశభక్తులు కులమతాలకు అతీతంగా పాల్గొని… దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారని వారి త్యాగాలని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఎన్నారై టిఆర్ఎస్ యు.కె.అద్యక్షులు అశోక్ గౌడ్, అడ్వైజరీ బోర్డు మెంబర్ వెంకట్ రెడ్డి , రవి ప్రదీప్ పులుసు, హరిగౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి గొట్టెముక్కల, రవి రేతినేని, హరిదీప్ రెడ్డి, మణితేజ, పావని సుజాత తదితరులు పాల్గొన్నారు