భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు సీఎం. అదే విధంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ. 1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. వర్షాలతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు చాలా దెబ్బతిన్నాయని…. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని చెప్పామని అదే జరిగిందన్నారు.
7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించిందని కేసీఆర్ చెప్పారు. బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. గోదావరికి 90 అడుగుల మేర వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతాం అన్నారు.
వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల ఇలాంటి ఉత్పాతాలు వస్తుంటాయని .. వాతావరణ శాఖ ప్రకారం.. 29 వరకు ఇదే పద్ధతిలో వర్షం ఉంటుందని చెప్పారు. ప్రమాదం ఇంకా తప్పిపోలేదు. మరో మూడు నెలలు వర్షాలు వచ్చే అవకాశం ఉందని…. అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు.