కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం అనాలోచిత చర్య అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్త ఆందోళనతోనైనా మోదీ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ పాలనలో హింసకు తావులేదని, హింసకు పాల్పడటం తమ నైజం కాదని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ పథకం సాయుధ బలగాల ప్రభావాన్ని దెబ్బతీస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారీగా ఉద్యోగాలు ప్రకటించామని కేంద్రం గొప్పలు చెప్పుకోవటానికి తప్ప ఇది నిరుద్యోగులకు ఏమాత్రం శాశ్వత పరిష్కారం చూపినట్లు కాదని..కేంద్ర ప్రభుత్వ తీరుపై ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. యువతకు నాలుగు ఏళ్లపాటు ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ యువతను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. నాలుగేళ్ల తర్వాత వారి పరిస్థితి ఏమిటని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు.