కాంగ్రెస్ పార్టీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరూ పట్టించుకోవట్లేదు..
ఆందోళన పేరుతో కాంగ్రెస్ విధ్వంసం సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్కు ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవ చేశారు. స్వతంత్ర సమర యోధులు ఏర్పాటు చేసిన దాన్ని కాంగ్రెస్ నేతలు వేల కోట్ల రూపాయలు అక్రమంగా అప్పనంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఊరికే దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా సంజయ్ ప్రశ్నించారు.
ఈడీ విచారణ చేయొద్దా.. అక్రమాలు బయటకు వస్తూ కాంగ్రెస్ను ప్రజలు సమాధి చేస్తారని భయంతోనే ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ, అమిత్ షాలు కూడా విచారణను ఎదుర్కొని.. నిజాయితీని నిరూపించుకొని బయటకు వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లాగా విధ్వంసాలకు పాల్పడలేదన్న బండి సంజయ్.. నేషనల్ హెరాల్డ్ కు సంబందించి వాస్తవాలను బయటకు చెప్పాలని.. ఈడీ విచారణ ఎందుకో ప్రజలకు వివరిస్తామన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి కాంగ్రెస్ నాయకులే పట్టించుకోవడం లేదని.. అయన నిజాయితీనీ నిరూపించుకొని బయటకు రావాలన్నారు అన్నారు బండి సంజయ్.