రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూసి టీఆర్ఎస్ను ఆశీర్వదించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాలోని మొగుల్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రకాలుగా అన్యాయం చేశాయని ఆరోపించారు. నాటి పాలకులు గ్రామాలను కనీసం పట్టించుకోలేదు. నీళ్లు లేవు, నిధులు లేవు, పనులు లేవు. మొత్తం ప్రజలు, కుల వృత్తులు అగమై, వలస పోయే దుస్థితి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. కేంద్రమే ఇస్తున్నది. మళ్లా వాళ్లే తెలంగాణలో ఏమీ జరగడం లేదని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చేతగాని వాళ్లు ఏదేదో మాట్లాడుతారు. అవన్నీ పట్టించుకోవద్దన్నారు. ప్రగతిని చూసి ఆశీర్వదించాలన్నారు.