బుధవారం మంత్రి హరీశ్ రావు మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. నర్పాపుర్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నో ఎళ్ల కళ నర్సాపుర్ ఈరోజు నెరవేరింది. ఈ డిపో రెండు ఏండ్ల ముందే ప్రారంభం కావాల్సింది. అయితే అప్పుడు కరోనాతో లేటైంది. లేటైనా లేటెస్ట్ గా ప్రారంభించుకున్నాం. ఆర్టీసీని మీరందరూ ఆదరించాలి. మీ సహకారంతోనే అర్టీసీ అభివృద్ది సాధ్యమని మంత్ర తెలిపారు. మనం అభివృద్దిని కోరుకుంటే..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిప్రభుత్వ సంస్థలను అమ్ముదం అంటున్నారు. మరి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
పార్లమెంట్‌లో ఇచ్చిన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైందని, తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ వెళ్లిందన్నారు. ఆర్థిక సంఘం నివేదికను కేంద్రం తొక్కిపెట్టిందని, తెలంగాణకు రూ.9వేలకోట్ల ఎగనామం పెట్టిందని, నీతి ఆయోగ్ సూచనలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ గుండెచప్పుడు కేసీఆర్ అన్నారు. నర్సాపూర్‌లో త్వరలో టూరిస్ట్ హబ్, పీజీ కాలేజీకి పక్కా భవనం నిర్మిస్తామన్నారు. రూ.35కోట్లు మంజూరు చేశామని, మల్లన్నసాగర్ నీళ్లు నర్సాపూర్ వస్తాయని, కాలంతో పని లేకుండా నీళ్లు వచ్చేలా చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలంలోనూ కరెంటు కష్టాలు లేవని, 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యామ్ నిర్మించలేదని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో 15 చెక్‌డ్యామ్‌లు కట్టామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారున్న కర్నాటకలో పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. కర్ణాటకలో రూ.1400కు క్వింటాల్ వడ్లు కొంటే.. తెలంగాణలో రూ.1920కి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కర్నాటక రైతులు రాష్ట్రానికి ధాన్యం తెచ్చి అమ్ముకుంటున్నారన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు కర్నాటకలో లేవన్నారు. వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలను మోసం చేయడమే తెలుసునని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్ తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మూటలు ఉన్నట్లుందని మంత్రి ఎద్దేవా చేశారు.