వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. చాలామంది యూత్ మేజర్ సందీప్‌లా సైనికులు అవ్వడానికి ఆసక్తిచూపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ సంయుక్తంగా మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మీ ప్రొడక్షన్ హౌస్ ఎలా ప్రారంభమైంది?
మావి ఛాయ్ బిస్కట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ అనే రెండు నిర్మాణ సంస్థలున్నాయి. మేమిద్దరం ఫస్ట్ షో
అనే మార్కెటింగ్ ఏజన్సీని 2000లో ప్రారంభించాం. అలా ఇప్పటివరకు రెండు వందల సినిమాలు మార్కెటింగ్ చేశాం. సర్కారువారిపాట, అంటే సుందరానికి.. మేం చేసినవే. 2015లో ఛాయ్ బిస్కట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ మొదలు పెట్టాం. పెద్ద సినిమాలు ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లో చేయాలనే మేజర్ చేశాం. ఛాయ్ బిస్కట్లో కొత్తవారిని పరిచయం చేస్తూ మూడు సినిమాలు చేశాం. సెప్టెంబర్‌లో అవి రిలీజ్ చేయబోతున్నాం.
మేజర్ కథ మీరు మొదటినుంచి విన్నారా?
మేం గూఢచారి సినిమా ప్రీమియర్ చూశాక తిరిగి ఆఫీసుకు వచ్చాం. చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాం. క్షణం, గూఢచారి చూస్తుంటే శేష్ కష్టం కనిపించింది. దాంతో తర్వాత ఏం చేయబోతున్నారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటి? అని శేష్ ని అడిగాం. అప్పుడు తను చెప్పింది ఒక్కటే.. యు.ఎస్.లో వున్నప్పుడు 26/11 తాజ్ ఎటాక్ చూశాను. మైండ్‌లో అలా వుండిపోయింది. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాడు. అది కూడా పాన్ ఇండియా మూవీ చేయాలనుందని చెప్పాడు.
మరి నమ్రత గారు ఈ సినిమాలో ఎలా ప్రవేశించారు?
మేం మార్కెటింగ్ చేసే క్రమంలో నమ్రతగారితో పరిచయం ఉంది. ఆ సమయంలో జీఏంబీ లో మంచి క్వాలిటీ సినిమాలు చేయాలని వుందని అన్నారు. అప్పుడు ఆమెకు విషయం చెప్పి శేష్నుకూడా మా ఆఫీసుకు రమ్మని నమ్రతగారితో మేజర్ గురించి చర్చించాం. నమ్రతగారికి బాగా నచ్చింది. ఇక బాలీవుడ్లో ఎలా ప్రమోషన్ చేయాలనుకుంటూ షారూఖ్‌ఖాన్, జీటీవీవారితో మాట్లాడాలని అనుకున్నాం. అదే టైంలో తాహెర్గారు సోనీ సంస్థ హైదరాబాద్ వస్తుంది. ఒకసారి కలవండన్నారు. అలా వారిని కలవడం. బ్రీష్గా కథ చెప్పడం. మేజర్ ఫొటో ప్రెజెంటేషన్ ఇచ్చాం. అది చూసి వారు మాతో కలవడానికి ముందుకు వచ్చారు. అలా మేము, నమ్రత, సోనీ కలిసి మేజర్ నిర్మించాం.
మీ సంస్థలో తొలి సినిమాకే అప్పటికే వచ్చిన 26/11 కథనే ఎందుకు ఎన్నుకున్నారు?
ఇది విధి అని అనుకోవాలి. 2008లో 26/11 ఎటాక్ జరిగిన టైంలో మేం ఇద్దరం ఇంజనీరింగ్ చేస్తున్నాం. కాలేజీ టూర్లో భాగంగా ఢిల్లీ వెళుతున్నాం. మేం వెళుతున్న ట్రైన్లో కొందరు జవాన్లు ఎక్కారు. వారితో మాటలు కలిపాం. వారు చెబుతున్న కథలు, రియల్ సంఘటనలు విన్నాక అవి మైండ్‌లో అలా నిలిచిపోయాయి. ఎప్పుడో మాతో శేష్ చెప్పిన కథ మరలా 2018లో మాకు మరలా అదే కథను తీయాలనిపించడం మాజిక్‌లా వుంది.
మేజర్ పాత్రపరంగా మేకింగ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
మా (శరత్) బ్రదర్ మేజర్ కర్నల్ గా వున్నారు. మా అన్నకు ఫోన్ చేసి సినిమా గురించి చెప్పడం, అందుకు తగిన దుస్తులు, పర్మిషన్, ఎక్కడ లొకేషన్లు వుంటాయి. ఇవన్నీ చర్చించి చేసిన సినిమా ఇది. ఈ సినిమా చేయాలనే మాకు రాసిపెట్టివుంది అనిపిస్తుంది.
మీరనుకున్న స్థాయిలో సినిమా వచ్చిందా?
గౌరవ ప్రదమైన సినిమా చేశాం. దేశమంతా మంచి పేరు వచ్చింది. చాలా గర్వంగా వుంది. ఈ సినిమాకు టైటిల్స్ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు వున్నారంటేనే సక్సెస్ అయినట్లు లెక్క.
పాన్ ఇండియా మూవీ చేయాలనే చేశారా?
మొదట తెలుగు, హిందీ అనుకున్నాం. సందీప్ తల్లిదండ్రులను కలిశాక ఆలోచన మారింది. వారు కేరళలో వుంటారు. మాకు తెలుగు, హిందీ రాదు. మేం చూడలేం అన్నారు. అప్పుడు మలయాళంలో డబ్ చేయాలని చేశాం.
మార్కెటింగ్‌పరంగా ఎంత పే చేస్తుందనే ఐడియా మీకు వుంటుంది. ఈ సినిమాకు రిస్క్ వుంటుందని ఊహించారా?
మేం నిజాయితీగా సినిమా తీశాం. మేజర్‌కు మహేస్‌బాబు స్ట్రెంక్త్. సందీప్ లైఫ్. అన్నిటికంటే కథే హీరో అని నిర్ణయించుకుని ముందుకు సాగాం. మే24నుంచి పూనెలో ప్రివ్యూ మొదలుపెట్టాం. అలా ఢిల్లీ, లక్నో అన్ని ప్రాంతాలను పర్యటించాం. అప్పుడు ప్రేక్షకుల తీర్పు ఎలా వుంటుందనే టెన్షన్ వుండేది. వారి మాటలు విన్నాక మాకు ధైర్యం వచ్చింది.
హిందీ మార్కెటింగ్ రెస్పాన్స్ ఎలా వుంది?
హిందీలో శేష్ మొదటిసారి పరిచయం అవుతున్నారు. బేనర్లు కొత్తవి. అయినా మేం ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాం. శుక్రవారంనాడు ఎలాంటి కలెక్షన్లు వున్నాయో సోమవారంనాడు కూడా అలాగే వున్నాయి. ముఖ్యంగా లక్నో, పంజాబ్ వంటి ప్రాంతాలనుంచి యూట్యూబ్ వీడియోలు చాలా బాగుందని చెబుతున్నాయి.
పెద్ద సినిమాలు సరసన మీ సినిమా విడుదలకావడం ఎలా అనిపించింది?
కమల్‌హాసన్ విక్రమ్, పృథ్వీరాజ్ సినిమాలతోపాటు మేజర్ సినిమా విడుదలయింది. వారి నిర్మాణ వ్యయం ఎక్కువ. మాది చాలా తక్కువ. అయినా ఆ సినిమాలకు ధీటుగా మా మేజర్ నిలవడడం ఎచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాం.
నిర్మాతలుగా ఇప్పుడు ఆలోచిస్తే ఇంకా డిఫరెంట్‌గా చేస్తే బాగుండేదని అనిపించిందా?
26/11 కథను మేం తీయలేదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను తీశాం. ఆయన లైప్. 26/11 అనేది ఓ భాగం మాత్రమే. ఈ సినిమా చూశాక యూత్ నుంచి వందకుపైగా ట్వీట్లు, మెసేజ్‌లు వచ్చాయి. మేము ఆర్మీలో జాయిన్ అవుతాం. ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయామా! అంటూ పోస్ట్‌లు వచ్చాయి. యూత్ అంతా యు.ఎస్.లో జాబ్‌లు, డాక్టర్, ఇంజనీర్లు అవ్వాలనుకుంటారు. కానీ ఆర్మీ గురించి ఆలోచిస్తున్నారంటే మేం ఎచీవ్మెంట్ సాధించాం అనిపించింది.
మహేష్‌బాబు, సోనీ వంటి పెద్ద సంస్థలతో ఎలా హ్యాండిల్ చేయగలిగారు?
మహేష్‌బాబు, నమ్రత నుంచి క్రియేటివ్ వైపు ఎటువంటి ఇష్యూలేదు. మన మేకింగ్ వారికి తెలుసు. శేష్ బాగా చేస్తాడని తెలుసు. టైంటు టైం ఫుటేజ్ చూసేవారు కూడా. సోనీవారే ముంబైలో వుండడం వల్ల మన పనివిధానం తెలీదు. అందుకే కొద్దిగా టెన్షన్ వుండేది. కానీ వారు ఎటువంటి జోక్యం కలగజేసుకోలేదు. కారణం మాపై నమ్మకం వుంచారు. మాకు సంధానకర్తగా నమ్రతగారు వున్నారనే ధైర్యం వుంది. అయితే సోనీవారికి హాలీవుడ్ స్టూడియో వుండడంవల్ల మేం చెప్పేది కొన్ని ఫాలో అయ్యేవారు. వారి దగ్గర నుంచి మేం కొన్ని నేర్చుకున్నాం.
రిలీజ్ డేట్ కరెక్టే అనిపించిందా?
మే 1నుంచి ఎప్పుడు రిలీజ్ చేయాలా అని ఆలోచిస్తూనే వున్నాం. రకరకాల చర్చలు జరిగాయి. సోలో రిలీజ్ ఎలాగూ కుదరదు. మే27 అనుకున్నాం. బాలీవుడ్లో టాప్‌గన్, తెలుగులో ఎఫ్3తోపాటు మరో సినిమా వున్నాయి. బాగా ఆలోచించి నా (శరత్) లక్కీ నెంబర్ కూడా 3 కావడంతో జూన్3న ఫిక్స్ అయ్యాం.
ప్రస్తుతం మీ నిర్మాణ సంస్థలో ఏయే సినిమాలు చేస్తున్నారు?
ఏ ప్లస్ ఎస్‌లో మేజర్ చేశాం. ఛాయ్ బిస్కట్ ఫిలిం బేనర్లో సుహాస్‌తో రైటర్ పద్మభూషణ్
, మేం ఫేమన్ అనే సినిమా ఇందులో సుమంత్ ప్రభాస్ అనే యూట్యూబ్ పేమస్ కుర్రాడు లీడ్‌రోల్ చేశాడు. అలాగే తొట్టెం పూడి వేణు లీడ్రోల్లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో మరో సినిమా చేస్తున్నాం. అవి త్వరలో విడుదలచేయాలనే ప్లాన్‌లో వున్నాం.
నిర్మాతలుగా మీ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఎలా వుంటుంది?
మేం 18 ఏళ్ళుగా స్నేహితులం. కోవిడ్‌లో అనురాగ్ 100కథలు విన్నాడు. అందులో మూడు ఫైనల్ చేశాడు. ఇక నేను (శరత్) మార్కెటింగ్ చూసుకుంటా.
ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది?
మైత్రీమూవీస్గానీ, దిల్‌రాజుగానీ చాలా సపోర్ట్ చేశారు. వారు థియేటర్లో టీజర్, ట్రైలర్ వేయడానికి హెల్ప్ చేశారు. మొన్నరాత్రే విజయ్‌దేవరకొండ సినిమా చూసి ట్వీట్ చేశారు. నిన్ననే అల్లు అర్జున్ సినిమా చూశారు. జన్యూన్‌గా సినిమా తీశారని అభినందించారు.
సందీప్ తల్లిదండ్రుల రెస్పాన్స్ ఎలా వుంది?
వారు ప్రతిచోట ప్రివ్యూకు వచ్చారు. నిన్ననే శేష్‌కు ఓ మెసెజ్ పంపారు. మాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందా? హ్యాపీనా అని పంపారు. ఇంకా ఏమైనా ప్రమోషన్ చేయాలంటే వస్తామని అన్నారు. 2008లో 31 ఏళ్ళ కొడుకును ఇప్పుడు వెండితెరపై వారు చూసుకుంటుంటే ఇంతకంటే మేం వారికి ఇవ్వగలం అనిపించింది. వారు వున్నంతకాలం వారికి గుర్తిండిపోయే సినిమా ఇవ్వగలిగాం.
రాయల్టీ ఏమైనా అడిగారా?
మేం ఇవ్వడానికి సిద్ధంగా వున్నాం. ఇదే విషయం వారికి ముందుగానే చెప్పాం. అది వినగానే గెటౌట్ ఫ్రమ్ మై హౌస్ అంటూ ఆవేశంగా మాట్లాడారు. వారు ఎలా వున్నారంటే సందీప్‌కు ఎల్.ఐ.సి. పాలసీ డబ్బులు కూడా తీసుకోలేదు. అంత నిజాయతీమనుషులు. అందుకే వారితో ఓ విషయం చెప్పాం. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఫౌండేషన్ లో యువత మిలట్రీలో చేరాలనుకున్నవారికి వెల్కమ్ చెబుతూ, అందుకు తగిన ఏర్పాట్లు, సందేహాలు ఇస్తూ వారికి సపోర్ట్‌గా నిలిచేలా సోషల్‌మీడియా వేదిక నెలకొల్పాలనుకున్నాం. అదే మేం వారి తల్లిదండ్రులకు ఇచ్చే రాయల్టీ.
ఎన్.ఎఫ్‌జి. కామండోలకు షో వేశారా?
గత నెలలోనే ప్రదర్శించాం. చాలా అభినందలు దక్కాయి. మా గురించి ఇంత కరెక్ట్‌గా హుందాతనంగా చూపించారంటూ వారితో కలిసి మాకు భోజనం ఏర్పాటు చేశారు. వారు మమ్మల్ని గొప్పగా రిసీవ్ చేసుకున్నారు.