తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది.. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మంగళవారం నుంచి హైదరాబాద్–తిరుపతి, తిరుపతి–హైదరాబాద్, తిరుపతి–కాకినాడ టౌన్, కాకినాడ టౌన్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
తిరుపతి–హైదరాబాద్ మధ్య 10 సర్వీసులు నడవనున్నాయి. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లనున్నాయి. తిరుపతి–కాకినాడ టౌన్ మధ్య 10 రైళ్లు నడుస్తాయి. రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లి గూడెంల మీదుగా నడుస్తాయి. వాటితో పాటు కాచిగూడ–తిరుపతి మధ్య రెండు వేసవి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. జూన్ 1, జూన్ 2న ఆ రైళ్లు నడుస్తాయి. ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంటల్లో ఆ రైళ్లు ఆగుతాయి.