అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్ టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ ప్రమోషన్ లో భాగంగా ఆదివారంనాడు వైజాగ్ పర్యటించారు. ముందుగా సినిమాను ప్రదర్శించి ఆ తర్వాత ప్రీరిలీజ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు.
నిర్మాతల్లో ఒకరైన శరత్ మాట్లాడుతూ, మా టీమ్ అంతా వైజాగ్ వాసులమే. సాయిమంజ్రేకర్ కు కథ చెప్పడానికి వైజాగ్ వచ్చాం. ఇప్పుడు మేజర్ సినిమా తీసి చూపించడానికి వచ్చాం. తెలుగు, హిందీలోనూ నిజాయితీగా చక్కటి సినిమా తీశాం. ఈ సినిమా జనాలకు చేరువవుతుందో లేదోనని భయంతో అందరికీ చూపించాలనే మార్చి 24 నుంచి స్క్రీనింగ్ వేశాం. అందులో భాగంగా ఈరోజు వైజాగ్ వచ్చాం. వైజాగ్ శరత్ థియేటర్‌లో వేశాం. మేజర్ సినిమా తీశాక ప్రమోషన్ లో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలను పర్యటించినప్పుడు ప్రతిచోట గౌరవంగా చూస్తున్నారు. తెలుగువారు గొప్పవారుగా వారు ట్రీట్ చేస్తున్నారు అని చెప్పారు.
అడవి శేష్ మాట్లాడుతూ, ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో చేయడం చాలా ఆనందంగా వుంది. ఇంతకు ముందు ఎవరు, గూఢచారి సినిమాలు హిట్ అవ్వాలని తీశాం. కానీ మేజర్ సినిమా మాత్రం సందీప్ జీవితం అందరికీ రీచ్ కావాలనే తీశాం. నేను సితార ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ లో సినిమా చేస్తుండగా బ్రేక్ ఇచ్చి ఈ సినిమా చేశాం. ప్రమోషన్ బెటర్ గా వుండాలని అందరికీ సినిమా చూపించాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇండియన్ ఫిలిం హిస్టరీలో సినిమా విడుదలకు 10 రోజులు ముందుగా 10 సిటీలలో ఇలా సినిమా చూపించడం గొప్ప విషయం. ఒకవైపు పైరసీని నియంత్రించేవిధంగా చర్యలు తీసుకుంటూ సినిమా చూపించాం. మొదట ఇలా చేయాలని పూణేలో ప్రకటించినప్పుడు బుక్ మై షో టికెట్ల బుకింగ్ పెట్టాం. అక్కడ మేజర్ కల్నల్ ఫ్యామిలీ వచ్చింది. వారు చూశాక ఇది కదా సందీప్ స్టోరీ
అన్నారు. నాకు గూస్ బంప్స్ వచ్చాయని కల్నల్ అన్నారు. మేజర్ అనేది సినిమా కాదు ఎమోషన్. అహ్మదాబాద్‌లో సినిమా చూశాక `భారత్ మాతాకీ జై.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహే! అంటూ నినాదాలు చేశారు.
ఇక ముంబైలో నేషనల్ షెక్యూరిటీ గార్డ్ కు సినిమా చూపించాం. అందులో ట్రైనింగ్ ఆఫీసర్ మేజర్ సందీప్. అక్కడ 312 కుటుంబాలు సినిమా చూశారు. కానీ అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. దాంతో మాకు అనేక అనుమానాలు వచ్చాయి. ఆరోజు రాత్రి 11.30గంటలకు హెడ్ క్వార్టర్స్‌కు రమ్మని మాకు ఫోన్ వచ్చింది. మేకింగ్ ఏదైనా తప్పుచేశామోననే భయంతో వెళ్ళాం. కానీ మా టీమ్ కు వారు ఓ మెడల్ బహూకరించారంటూ. చూపించారు. నేషనల్ సెక్యూరిటీ బ్లాక్ కమాండో మెడల్ ఇది. అక్కడ సందీప్ విగ్రహం కూడా వుంది. ఈ మెడల్ అందుకోవడం ఆస్కార్ కన్నా గొప్పవిషయం. ఆ తర్వాత హోం టౌన్ లో సినిమా చూపించాలని వైజాగ్ వచ్చాం. ఇది సెలబ్రేషన్ గా ఫీలవుతున్నాం. ఇండియన్ ఫిలిం హిస్టరీలో సినిమా చూపించి ప్రీరిలీజ్ చేయడం మొదటిసారి. ఈ సినిమా సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ తెలుగు, హిందీలోనూ ప్రోపర్‌గా తీశాం. హైదరాబాద్ లో తెలుగు వారు చేసిన ఇండియన్ ఫిలిం మేజర్. ఇందులో నటించిన వారంతా తెలుగు ఓన్ డబ్బింగ్ చెప్పారు అని అన్నారు.
సాయిమంజ్రేకర్ మాట్లాడుతూ, వైజాగ్ రావడం చాలా ఆహ్లాదరకంగా వుంది. మూడేళ్ళనాడు ఇక్కడకి వచ్చాను. మరలా ఇప్పుడు టీమ్ తో కలిసి మీతో షేర్ చేసుకోవడం గొప్పగా వుంది అన్నారు. దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ, తెలుగు సిటీలో ప్రమోషన్ మొదలైనందుకు ఆనందంగా వుంది. మీ రియాక్షన్ మాకు కావాలి. సినిమా చూడండి అని తెలిపారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ, వైజాగ్ లో కాలేజీలో నేను షోలు చేసేవాడిని. సినిమా రంగంలోకి వస్తానని అస్సలు అనుకోలేదు. నన్ను శేష్ నమ్మాడు. పాన్ ఇండియా సినిమా ప్రీరిలీజ్ వైజాగ్ లో జరుగుతున్నందుకు ఆనందంగా వుంది. నా జర్నీ వైజాగ్ లోనే పాటతో మొదలైంది. దర్శకుడు శశికిరణ్ తో గూఢచారి నుంచి పనిచేస్తున్నాను. నేను 2007లో ఓ పాట కంపోజ్ చేశాను. దానికి ఇక్కడి మీడియా ఎంతో సపోర్ట్ చేసిందని అన్నారు.
కెమెరామెన్ వంశీ మాట్లాడుతూ, నేను ఇక్కడే చాలామందితో పనిచేశాను. నోవాటెల్ లో ఇన్ హౌస్ యాడ్స్ చేశాను. నేను ఇక్కడే బుల్లయ్య కాలేజీలో చదివాను. శేష్ ను కలిసింది కూడా వైజాగ్ లోనే. ఇక్కడే ఫొటోగ్రాఫర్ గా పనిచేశాను. శేష్ చేసిన ఎవరు సినిమా నా తొలి సినిమా. ఈరోజు మేజర్ చేసిన శేష్ సక్సెస్ లో భాగమైనందుకు చాలా ఆనందంగా వుందంటూ.. నిన్ననే ఓ నదిలో ప్రమాదవశాత్తూ చనిపోయిన సైనికులకు శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాపం తెలియజేసారు. అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.