తెలంగాణ బీజేపీలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుతో పాత బీజేపీ నేతలే కాదు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒంటెత్తు పోకడలకు తోడు తాము ఏం చేసినా తప్పన్నట్లుగా బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు అధిష్టానంతోనే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా చాలా మంది సీనియర్లు ఆ మధ్య ఓ చోట సమావేశం అయ్యారు. కేంద్ర పార్టీకి విషయం చేరవేయాలని… బండి సంజయ్ ఉంటే తాము పార్టీలో ఉండటం కష్టంగా ఉందన్న నిర్ణయానికి వచ్చారు.
అయితే, పార్టీలో అసమ్మతిపై కేంద్ర నాయకత్వం సీరియస్ అవ్వటంతో కాస్త వెనక్కి తగ్గారు. కానీ, వీరికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తోడవటంతో కొంతకాలంగా పార్టీ నేతలు బండి సంజయ్ పై తుపాకులు ఎక్కుపెడుతున్నారు. పాత నేతలతో పాటు పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఈటల రాజేందర్, రఘునందన్ తోనూ బండి సంజయ్ దూరం పాటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు ఇచ్చే ప్రకటనల్లో సైతం రఘునందన్, రాజేందర్ ల ఫోటోలు కనపడటం లేదు. దీంతో మమ్మల్ని తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ ఆ నేతల వర్గాల్లో గట్టిగానే ఉంది.
అయితే, ఇటీవలి అమిత్ షా పర్యటనలో బండికి బూస్ట్ ఇచ్చేలా ఆయన వ్యవహరించారు. దీంతో ఇక్కడే ఉండి చెప్తే లాభం లేదు… పై స్థాయిలో ఏదో జరుగుతుందని భావించిన సీనియర్లు, ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అసలు ఆయనతోనే విషయం తేల్చుకోవాలని… పార్టీలోకి బలమైన నేతలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న తనకు అండగా ఉండాల్సింది పోయి, నువ్వు ఎవరు జోక్యం చేసుకునేందుకు అంటూ ఈటలపై మాట్లాడిన తీరును నేతలు హైకమాండ్ వద్దే తేల్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.
తమను పట్టించుకోకుండా… సమాచారం ఇవ్వకుండా… పార్టీని ఎన్నికలకు ఎలా రెడీ చేస్తారని, ఉద్యమ సమయం నుండి రాష్ట్రమంతా ఫాలోయింగ్ ఉన్న నేతలను పక్కనపెట్టడం పార్టీకి ఏలా లాభమో అధిష్టానాన్నే అడగాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుండి వలస వచ్చిన ముగ్గురు నేతల మధ్య బండి సంజయ్ బంధీగా మారి పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తూ, కేసీఆర్ పై పోరాటం చేసే నేతను అనుమానిస్తూ… అవమానిస్తున్నారని వారి క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.