రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం పాలకుర్తి బషారత్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈరోజు నుండి ప్రారంభమౌతున్న ఈ శిబిరంలో పిల్లలకు పెడుతున్న భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి శిక్షణకు వచ్చిన ఉద్యోగార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా ఉషా దయాకర్ రావు అధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయన్నారు. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, అంబులెన్స్ లు వంటివి ఎన్నో చేశాం. అలాగే ఈ ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అందుబాటులో ఉండటానికి వీలుగా అటు తొర్రూరులో తొర్రూరు, రాయపర్తి, పెద్ద వంగర మండలాలకు, ఇటు పాలకుర్తిలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల వాళ్లకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఈ శిక్షణ వల్ల ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు పొందారు. మరికొంత మంది ఉద్యోగాలు పొందాలన్నదే మా సంకల్పం అన్నారు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. కష్టపడి చదవండి. ఇష్టమైన ఉద్యోగాన్ని సాధించాలని నిరుద్యోగులకు మంత్రి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనే వాళ్లకు ఇది మంచి అవకాశం అన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.