మంత్రి కేటీఆర్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనల,ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం, బండలింగంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టనున్న పునరుద్ధరణ పనులుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు ‘దళిత బంధు’ పథకంలో భాగంగా పదిరకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకుంటున్న పెట్రోల్ బంక్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులు.. సాధికారత, స్వావలంబన సాధించేందు కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ కేటీఆర్ స్పష్టం చేశారు. దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమో, ఓట్ల కోసమో ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూలీల నుంచి ఓనర్లుగా, సక్సెస్ పుల్ వ్యాపార వేత్తలుగా ఎదగాలనీ మంత్రి ఆకాంక్షించారు.
అరవై ఏండ్లుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని మంత్రి అన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే నేరుగా లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదని తెలిపారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సొంతంగా చూసుకోవాలని మంత్రి అన్నారు.