కాంగ్రెస్, బీజేపీ కుక్కులు మొరుగుతై.. మంత్రి హరీష్‌ ఫైర్‌..

86
harish
- Advertisement -

ప్రతీ జిల్లా కేంద్రంలో నర్సింగ్ కాలేజి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ జిల్లా కాని బాన్సువాడలో నర్సింగ్ కాలేజీని 50 కోట్ల ఖర్చుతో ఇవాళ ప్రారంభించుకున్నాం అని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం బాన్సువాడలో 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్‌ రావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాసన సభ స్పీకర్ అయినా నర్సింగ్ కాలేజీ ప్రారంభమైన రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాలేజీ విద్యార్థినులతో భోజనం చేశారు. బాన్సువాడకు ఓ పెద్దగా స్పీకర్ వ్యవహరిస్తున్నారు. రైతులు, కార్మికులు,పేదలు ఎవరు అయినా చిత్తశుద్దితో వారి కోసం పని చేసే వ్యక్తి స్పీకర్ పోచారం అని మంత్రి అన్నారు.కాంగ్రెస్, బీజేపీ కుక్కులు మొరుగుతుంటయి..డబులు బెడ్ రూం ఇళ్లు ఎక్కడున్నయి అని మొరుగుతున్నరు. బాన్సువాడకు రండి.. ఆరు వేల ఇళ్లు కట్టి ఇళ్లల్లకు పేదలను తోలిండ్రు. ఇంకా నాలుగు వేల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది. ఇంకో నాలుగు వేల ఇళ్లు ఇస్తే బాన్సువాడలో ఇళ్లు లేని పేదలుండరు అని చెప్తున్నరు అని హరీష్‌ పేర్కొన్నారు.

బట్ట కాల్చి మీద వేయాలని సిద్దిపేటలో ఇళ్లు కట్టింట్రు అంటరు. కాని నేను 900 ఇళ్లు కట్టి ఉంటా.. బాన్సువాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్లకు కట్టడానికి ఎంతో శ్రమపడిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్సువాడలో సాగు నీరు లేక పోవడంతో, పొట్టకొచ్చిన చేలు ఎండిపోతుంటే రైతుల బాధలు ఆనాడు వర్ణనాతీతం. నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు వారానికోసారి ఫోన్ చేసి కాళేశ్వరం పూర్తయిందా, మల్లన్నసాగర్ పూర్తయిందా అని పోచారం అడుగుతుండేవారు. మల్లన్న సాగర్ పూర్తయితే నిజాం సాగర్ నిండి నీళ్ల సమస్య తీరుతుందని వ్యవసాయ శాఖ మంత్రిగా, బాన్సువాడ ప్రజా ప్రతినిధిగా తన్నులాడారు.

బీజేపీ, కాంగ్రెస్ వాళ్ల ఎమన్నరు. ప్రాజెక్టు కానే కాదన్నరు. నీళ్లు రానే రాదన్నరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది రైతుల భూములతో అని చెప్పిండ్రు. అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేసిన్రు. ఎన్ని కుట్రలు చేయాలో చేసిండ్రు. కాని పట్టుదల వ్యక్తి కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంది కాబట్టి దేశంలో ఏ ప్రాజెక్టు ఇంత స్పీడ్ గా పూర్తి కాలేదు. ఇంత పెద్ద మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రపంచంలోనే లేదు. మూడున్నరేళ్లలో పూర్తి చేసి నీరందించినం. పోయిన సారి శాంపిల్ గా మల్లన్న సాగర్ నుండి నీళ్లు వదిలితే కొండపోచమ్మ సాగర్ నుండి హల్దీ వాగుకు, హల్దీ వాగు నుంచి మంజీరకు అక్కడి నుండి బిర బిరా నీళ్లు పారుకుంటూ నిజాం సాగర్ కు వచ్చినయ్. ఆ టన్నెల్ పనులు పూర్తి కానుంది. పని స్పీడ్ గా జరుగుతుంది. రాబోయే రోజుల్లో నిజాం సాగర్ ఎండటం అనేది ఉండదు. నిండే ఉంటది. కాంగ్రెస్, టీడీపీ హయాంలో నిజాం సాగర్ ఎండిపోయేది. అందులో క్రికేట్ ఆడేవాళ్లు. రైతులు బాధలు పడే వారు. రైతుల ధర్నాలు, రాస్తారోకోలు. ఈనాడు పరిస్థితి మారింది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు ఫుల్. రెండు పంటలకు ఢోకా లేదు. కాళేశ్వరంతో నిజాం సాగర్ నిండుగ ఉంటది. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నరు. తాగడానికి నీళ్లు ఇచ్చిరా.. నిజాం కట్టిన ప్రాజెక్టు తప్ప. మీరు చేసిందేంటి ఏంటి. ఎప్పుడున్న రెండు వేల పెన్షన్ ఇచ్చిండ్రా. కర్ణాటకలో బీజపీ 600 రూ ఇస్తున్నరు. కేసీఆర్ గారు మనకు 200 రూ ను 1000 చేశారు. తర్వాత 2016 రూపాయలు చేసారు. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు వస్తయి. 57 ఏళ్లు పూర్తయిన వారికి పెన్షన్ ఇస్తం అన్నారు.

కాంగ్రెస్,టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఒక్క రూపాయి ఇచ్చిండ్రా అని మంత్రి హరీష్‌ ప్రశ్నించారు.. కేసీఆర్ లక్ష మందికి పెళ్లిళ్లు చేసిండ్రు. లక్ష నూట పదహార్లు పేదింటి ఆడపిల్లలకు ఇచ్చిండ్రు. కేసీఆర్ కిట్ ఇస్తున్నడు కేసీఆర్. 12 వేల రూపాయలు ఇచ్చి, కడుపు నిండ భోజనం పెట్టి, తల్లి పిల్లను ఆటో కిరాయి ఇచ్చి ఇంటికి పంపుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కొద్ది మంది పెద్ద ఆపరేషన్లు చేయిస్తున్నరు. అభివృద్ధి చెందిన దేశాల్లో రూపాయికి 20 పైసల మందమే ఆపరేషన్లు చేస్తరు. 70 పైసల మందం నార్మల్ డెలివర్ చేస్తరు. దీని వల్ల ఆరోగ్య పాడవతుంది. చాలా నష్టం జరుగుతుంది. దీని వల్ల పనులు చేసుకోలేకపోతున్నరు. బరువు పనులు చేయలేకపోతున్నరు. అవసరం లేకుండా ఆపరేషన్లు చేయించుకోవద్దు. అక్కా చెల్లెళ్లు మీరు ఆపరేషన్లు చేయమని తొందరపెట్టవద్దు.

పుట్టిన పిల్లలు తొలి గంటలో తల్లి పాలు తాగితే అవి అమృతంతో సమానం. మొదటి గంటలో పాలు తాగకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఆపరేషన్ జరిగితే ఆ తల్లి తొలి గంటలో శిశువుకు పాలు ఇవ్వగలదా. పిల్లలు తొలి గంటలో తల్లి పాలు తాగితే చురుకుగా ఉంటరు. రోగ నిరోథక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటరు. ఆపరేషన్ల వల్ల తల్లి ఆరోగ్యం, పుట్టిన బిడ్డ ఆరోగ్యం దెబ్బతీస్తున్నం. కాబట్టి అంగన్ వాడీలు, ఆశాలు మీరు సమావేశం పెడతారు. మీరు తల్లికి, వారి పెద్దవాళ్లకు నార్మల్ డెలివరీ ఆవశ్యకతను వివరించండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోండి. ప్రయివేటుకు వెళ్లి అనవసరంగా ఖర్చులు పెట్టుకోవద్దు అని మంత్రి సూచించారు.

రాబోయే రోజుల్లో బాన్సువాడ ఆసుపత్రిలో పోచారం విజ్ఞప్తి మేరకు ఐదు డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేస్తం. అలాగే 40 లక్షలతో మంచి పోస్టుమార్టం కేంద్రం ఏర్పాటు చేస్తం. సిబ్బంది ఇంకా కావాలని కోరారు, అవి మంజూరు చేస్తం. ఆశాలు పోటీ పడి పని చేయాలి. దేశంలో ఎక్కడ లేనివిధంగా 9500 రూపాయలు కేసీఆర్ ఇస్తున్నరు. కరోనా టైంలో మీరు బాగా పని చేశారు. రాబోయే రోజుల్లో ఆశాలు, ఎ. ఎన్. ఎంలు ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా పని చేయాలి అని మంత్రి హరీష్‌ రావు సూచించారు.

- Advertisement -