గ్లోబల్‌ కేపబిలిటి సెంటర్లకు హైదరాబాద్‌ అనువైన ప్రదేశం- కేటీఆర్

63
- Advertisement -

హైదరాబాద్‌లో థర్మో ఫిషర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. 15 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ పరిశోధనా కేంద్రం ద్వారా 450 మంది ఇంజినీర్లకు ఉపాధి కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2030 లోపు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 100 బిలియన్‌ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. లైఫ్‌ సైన్సెస్‌లో డేటా సైన్స్‌ కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్‌ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని కేటీఆర్‌ వెల్లడించారు.

థర్మో ఫిషర్స్‌ కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందని చెప్పారు. ఈ సంస్థ పరిశోధన కోసం ఏటా 1.4 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధన చేస్తున్నదని తెలిపారు. గత నెలలో బోస్టన్‌లో థర్మో ఫిషర్స్‌ ప్రతినిధులను కలిశానని గుర్తుచేశారు. పరిశోధన కేంద్రాల విషయంలో ఆసియాలోనే క్రియాశీలక స్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నైపుణ్యం, సామర్థ్యం విషయంలోనూ హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానమని చెప్పారు. నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్‌, ఇక్రిశాట్‌, సీఎస్‌ఐఆర్‌ వంటి ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్లోబల్‌ కేపబిలిటి సెంటర్లకు కూడా హైదరాబాద్‌ మంచి ప్రదేశమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

- Advertisement -