కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి వర్గం మండిపడుతోంది. వరంగల్ లో నిర్వహించబోయే రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి రాహుల్ గాంధీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి పర్యటనపై చౌటుప్పల్ మండలం, ఆందోల్ మైసమ్మ టెంపుల్ దగ్గర ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించొద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రేవంత్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారని, సభను విజయవంతం చేస్తామంటూ రేవంత్ వర్గీయులు దుబ్బాక నర్సింహ రెడ్డి,పల్లె రవి మరికొంతమంది నేతలు పేర్కొన్నారు. అయితే గ్రూపు రాజకీయాలతో రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన రద్ధయింది. రేవంత్ సన్నాహక సమావేశాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వ్యతిరేకించారు. దీంతో నల్గొండ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల రచ్చ తారా స్థాయికి చేరింది.
ఇప్పటికే రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంటిముట్టనట్టుగా ఉంటున్న కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ గొడవతో రేవంత్‌తో ఆమీతుమి తేల్చుకోవడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనను జానారెడ్డి, దామోదర్ రెడ్డిలు ఆహ్వానిస్తున్నారు. అటు జానారెడ్డి, దామోదర్ రెడ్డిలు రేవంత్ పర్యటనను స్వాగతిస్తుంటే.. ఇటు కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డిలు వ్యతిరేకించడంతో నల్గొండ కాంగ్రెస్‌లో అసమ్మతి రాగం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. గ్రూపు రాజకీయాలతో రేవంత్ రెడ్డి పర్యటన రద్దవడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.