కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదంటూ ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ తిరస్కరించిన విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ ను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీలో చేరమని కోరింది..కానీ ప్రశాంత్ కిషోర్ నిరాకరించాడు. పార్టీ కోసం ఆయన ఇచ్చిన సూచనలతో ప్రెజెంటేషన్ ను అభినదిస్తున్నామన్నారు సూర్జేవాల. ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించారు.
ఇక ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారన్న వార్తలు వినిపించాయి. పార్టీలోకి పీకే చేరికను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలను ఒప్పించే పనిని సోనియా చేపట్టారని, సోనియా చర్చలతో వారు కూడా మెత్తబడ్డారన్న వార్తలూ వినిపించాయి. అంతేకాకుండా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరిపోవడం ఖాయమైపోయిందని, ఆయనకు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించనుందని కూడా ప్రచారం సాగింది. ఇలాంటి నేపథ్యంలో పార్టీలో చేరేందుకు ప్రశాంత్ విముఖత చూపించడం సంచలనంగా మారింది.