బండి తీరుపై రఘునందన్ రావు అసంతృప్తి..!

83
MLA Raghunandan Rao
- Advertisement -

తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయతీ ప్రారంభమయింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై రఘునందన్ రావు అసంతృప్తిగా ఉన్నారు. సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా సాగుతోన్న ఉదంతంలో టీఆర్ఎస్ సర్కారు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపిస్తోన్న టీబీజేపీ పెద్దలు.. సొంత పార్టీ వ్యవహారాల్లోనూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనను పట్టించుకోవడం లేదని రఘునందన్‌ రావు ఫీలవుతున్నారు. దీంతో పాదయాత్ర రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. బండి సంజయ్ తనను ఆహ్వానించలేదని పిలవకుండా వెళ్లి అవమానపడదల్చుకోలేదని ఆయన అంటున్నారు. మొదటి విడత పాదయాత్ర మెదక్ జిల్లాలో సాగిన తనకు సమాచారం ఇవ్వలేదని రఘునందన్ అంటున్నారు. బీజేపీలో రఘునందన్ తీరు ఇటీవలి కాలంలో రెబల్‌గా కనిపిస్తోంది. ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు అయినా .. ఆయన బీజేపీఎల్పీ భేటీకి హాజరు కావడం లేదు. రాజాసింగ్ ప్లేస్‌లో తనకు ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం అడ్డు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

బండి సంజయ్ కు.. రఘునందన్‌కు వివిధ అంశాల్లో గ్యాప్ పెరిగిపోతోంది. తెలంగాణ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ, గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీలో అసంతృప్త స్వరాలు అంతర్గతంగా కలకలం సృష్టిస్తోంది. కేంద్రం పెద్దల జోక్యంతో ఈ వ్యవహారం సర్దుమణిగినట్లు అనిపించినా పార్టీ కార్యక్రమాల వేదికలపై ప్రొటోకాల్‌ పాటించట్లేదంటూ దుబ్బాక ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం మరోసారి సంచలనం రేపుతున్నది. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌ వైఖరిని తప్పుబడుతూ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులుకు రఘునందన్‌ తన అసంతృప్తిని తెలియజేశారని వెల్లడైంది. రోజూ అవమానిస్తుంటే భరించాలా? అని, పార్టీ ప్రొటోకాల్‌ పాటించకపోతే కుదరదని రఘునందన్ తేల్చిచెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆహ్వానించినా తనను వేదికపైకి పిలవకపోవడం, కొంత కాలంగా పలు సందర్భాల్లో బండి తీరు అవమానించేలా ఉందని రఘునందన్ బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర చార్మినార్‌ వద్ద ప్రారంభించినప్పుడు, ముగింపు సభ సిద్దిపేట జిల్లాలోని జరిగినప్పుడూ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అవమానించడం కాదా? అని రఘునందర్ ప్రశ్నిచినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, విప్‌ పదవులు ఇవ్వాలని రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌ ఛుగ్‌ చెప్పినా సంజయ్ దానిని అమలు చయడంలేదని, జీహెచ్ఎంసీతోపాటు కరీంగనర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ నియామకాల విషయంలోనూ బండి ధోరణి సరిగా లేదని దుబ్బాక ఎమ్మెల్యే విమర్శించినట్లు సమాచారం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ జిల్లాల పర్యటన పట్లా సంజయ్‌ అసంతృప్తిగా ఉన్నట్లూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రఘునందన్ రావు తనకు అవమానం జరుగుతోందని నిలదీశారు. ఈ రెండిటికీ సమాధానమా? అన్నట్లుగా బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని.. టికెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. వారికి, వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. మొత్తానికి బీజేపీలో బండి సంజయ్‌ సీటు కింద అగ్గిరాజేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇటు రాష్ట్ర పార్టీలో, అటు జిల్లాస్థాయి పార్టీ నేతల్లో బండి సంజయ్‌ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతలన్నింటిని తట్టుకుని బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఎన్ని రోజులు ఉంటారో చూడాలి.

- Advertisement -