ఐరెన్ లెగ్ టూ గోల్డెన్ లెగ్.. రోజా రాజ‌కీయ నేప‌థ్యం..

93
Minister RK Roja
- Advertisement -

సినిమా వాళ్లు రాజ‌కీయాల్లోకి రావ‌టం స‌హ‌జ‌మే అయినా స‌క్సెస్ ఫుల్ పొలిటిష‌న్ అయిన వాళ్లు చాలా త‌క్కువ‌. స్క్రిప్ట్ చూసి డైలాగ్స్ చెప్ప‌గ‌ల‌రేమో కానీ పొలిటిక‌ల్ వార్‌లో ఘాటుగా మాట్లాడ‌గ‌ల వారు త‌క్కువ‌. అందులోనూ మ‌హిళ‌లు మ‌రీ త‌క్కువ‌. కానీ, ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. సినీ రంగం నుండి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి త‌న మాట‌ల‌తో పార్టీల‌కు ప్ల‌స్ అయ్యారు. రాజ‌కీయాల్లో ఉండే ఒడిదొడుకుల‌ను ఎదుర్కొని నిల‌బ‌డ్డారు. తెలుగు దేశం నుండి 2004లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ గాలిలో కొట్టుక‌పోయారు. 2009లోనూ ఓట‌మే.కానీ రాజకీయంగా త‌న మాట‌ల చ‌తుర‌త‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ‌రుస‌గా ఓడిపోవ‌టంతో ఐర‌న్ లెగ్ అన్న విమ‌ర్శ‌ల పాల‌య్యారు రోజా.

2009 ఎన్నిక‌ల త‌ర్వాత వైఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో హ‌స్తం గూటికి చేరారు. కానీ కొద్దిరోజులకే వైఎస్ మ‌ర‌ణంతో త‌నపై ఉన్న ఐరెన్ లెగ్ విమ‌ర్శ‌లు ఇంకా ఎక్కువ‌య్యాయి. వైఎస్సార్ మరణానంతరం రోజా వైఎస్ జగన్ వెంట నడిచారు. 2014,2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున న‌గ‌రి నుండి పోటీ చేసిన రోజా గెలుపొందారు. 2014లో రోజా గెలిచినా పార్టీ అధికారంలోకి రాలేదు. అందుకే 2019లో ఇటు రోజా గెల‌వ‌టం, అటు పార్టీ అధికారంలోకి రావ‌టంతో… గెలిచిన సంతోషంలో రోజా చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం అయ్యాయి. తాను ఐర‌న్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అంటూ క‌న్నీటితో రోజా కామెంట్ చేశారు.

2014లో రోజా ఎమ్మెల్యేగా గెలిచినా… స‌భ‌లో టీడీపీ నుండి ఎంతో ఇబ్బంది ప‌డ్డారు. ఎంత ఇబ్బంది ప‌డ్డా… జ‌గ‌న్ వెంటే న‌డిచారు. మాట‌కు మాట స‌మాధానంగా జ‌గ‌న్ కోట‌లో న‌డిచారు. అందుకే 2019లో పార్టీ అధికారంలోకి రాగానే రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయం అని అంతా భావించినా జ‌గ‌న్ తీసుకోలేదు. రోజా అలిగార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. త్వ‌ర‌లో అవ‌కాశం ఇస్తా అని జ‌గ‌న్ హామీతో రోజా అల‌క‌వీడారు.

అలా వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయనకు తోడుగా ఉంటోన్న ఎమ్మెల్యే రోజాకు ఎట్టకేలకు మంత్రి పదవి వరించింది. విధేయతకు పట్టం కడుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రెండో దఫా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రోజాకు క్యాబినెట్ లో అవకాశం కల్పించారు జగన్. నిజానికి చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా…? పెద్దిరెడ్డి అడ్డుప‌డ‌తారా….? అన్న చ‌ర్చ సాగింది. ఓ ద‌శ‌లో త‌న పేరు ప‌క్క‌న పెట్టార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ, జ‌గ‌న్ రోజా విధేయ‌త‌కు గుర్తింపు ఇస్తూ మంత్రిని చేశారు.

రోజా రాజ‌కీయ నేప‌థ్యం..

రోజా అసలు పేరు శ్రీలత. 16- 11-1971న కుమారస్వామి దంపతులకు జన్మించారు. చిత్తూర్ జిల్లాకు చెందిన కుమారస్వామి హైదరాబాద్ కు వలస వెళ్ళారు. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోన్న సమయంలో ప్రేమ తపస్సు చిత్రం ద్వారా సినిమాలకు పరిచమయ్యారు రోజా. అంతకుముందే తమిళ చిత్రం చంబరతి చిత్రంలో నటించారు. తెలుగులో చేమంతిగా డబ్ చేసిన ఈ సినిమాను దర్శకుడు ఆర్కే సెల్వమణి రూపొందించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు వివరించి వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. రోజా -సెల్వమణి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇటు రాజ‌కీయాల‌తోనే కాదు తెలుగులో పాపుల‌ర్ ప్రోగ్రాం జ‌బ‌ర్ధ‌స్ కామెడీ షో తో ప్ర‌తి తెలుగింటికి రోజా ప‌రిచ‌య‌మే. ఈ షోకి జ‌డ్డిగా రోజా ఉన్నారు. ఓ ద‌శ‌లో ఈటీవీ, మ‌ల్లెమాల సంస్థ మెగా బ్ర‌ద‌ర్ నాగబాబును వ‌దులుకున్నారే కానీ రోజాను వ‌దలుకోలేదు. అంతేకాదు ఏ పండుగ వ‌చ్చినా ప్ర‌తి ఇంట రోజా గొంతు ప్ర‌త్యేక ప్రోగ్రామ్ తో విన‌ప‌డాల్సిందే. అయితే, ఎమ్మెల్యేగా ఉంటూ బూతు కామెడీ షోలో ఎలా వెళ్తార‌ని ఓ ద‌శ‌లో విమ‌ర్శ‌లొచ్చాయి. అయితే, తాను ఆర్థికంగా క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అన్నం పెట్టిన షో జ‌బ‌ర్ధ‌స్త్ అని… అందుకే కంటిన్యూ అవుతున్నాన‌ని త‌న‌దైన శైలీలో స‌మాధానం చెప్పిన రోజా, ఇప్పుడు మంత్రి అయ్యాక షో నుండి బ‌య‌ట‌కు పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంది.

ఏది ఏమైనా… క‌ష్టే ఫ‌లి అన్న సిద్ధాంతాన్ని న‌మ్మి, నిత్యం పోరాడుతూ… రాజకీయాల్లో నిల‌బ‌డ్డ నేత రోజా. స‌రిలేరు నీకెవ్వ‌రు.

- Advertisement -