ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా లక్నో విజయయాత్రకు బ్రేక్ పడింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నోపై రాజస్తాన్ విక్టరీ సాధించింది. రాజస్తాన్ విధించిన 166 పరుగుల లక్ష్యచేదనలో 162 పరుగులు చేసింది లక్నో. దీంతో 3 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది.
ఓపెనర్ క్వింటన్ డి కాక్ (39), దీపక్ హుడా (25), కృనాల్ పాండ్య (22) పర్వాలేదనిపించగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (0),కృష్ణప్ప గౌతమ్ (0), జేసన్ హోల్డర్ (8), ఆయుష్ బదోని (5), దుష్మంత చమీర (13) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన మార్కస్ స్టొయినిస్ (38), అవేశ్ ఖాన్ (7) ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓ దశలో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టును హెట్ మైర్, అశ్విన్ జోడీ ఆదుకుంది. ముఖ్యంగా షిమ్రోన్ హెట్ మైర్ 36 బంతుల్లోనే 59 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ (28) పరుగులు చేశారు.