విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలీడే ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఏపీలోని 5 జిల్లాల పరిధిలో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉండనుంది.
ఓవైపు వేసవి కారణంగా విద్యుత్ కు డిమాండ్ పెరగడం, మరోవైపు బొగ్గు కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డిస్కమ్ లకు 14వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. 2వేల మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభ్యమవుతుందని…. పరిశ్రమలు రోజువారి వినియోగంలో 50శాతం తగ్గించుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 8 నుంచి 22 వరకు రెండు వారాలు పవర్ హాలిడే అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెలతో పాటు ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ కోతలతో పేషెంట్లు నరకం చూస్తున్నారు.