బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు..

53
- Advertisement -

బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రోజు రోజుకు వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న వర్గ విభేదాలతో పార్టీకి మరిన్ని ఇబ్బందులు వచ్చి పడుతున్నాయనే చెప్పొచ్చు. ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పుకొంటున్న నాయకులకు మరోవైపు పార్టీ క్యాడర్‌లో ఉన్న విభేదాలు, ఆధిపత్యపోరుతో ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్‌రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తనను కాదని రాకేష్‌ రెడ్డి సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారని, బీజేపీ సంస్థాగత నిబంధనలకు విరుద్ధంగా రాకేష్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి రావు పద్మ ఫిర్యాదు చేశారు. వరంగల్‌ పశ్చిమంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రాకేశ్‌రెడ్డి సొంత కార్యక్రమాలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర నేతలకు తెలిపారు. బీజేపీలో ఏదైనా పార్టీ పరంగా జరుగాలని, ఇప్పుడు కొత్తగా వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తున్నారని పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వరంగల్‌ పశ్చిమంలో బీజేపీ నేతల సొంత ఎజెండాలతో ఆ పార్టీ శ్రేణులు అయోమయానికి లోనవుతున్నారు. ‘పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వారి కంటే.. రాద్ధాంతాన్నే సిద్ధాంతంగా చేసే వారి హడావుడి ఎక్కువైంది’ అని మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో కొత్త నేతల వ్యవహారాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా పరిగణిలోకి తీసుకున్నదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాకేశ్‌రెడ్డికి త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. మరోవైపు వరంగల్‌ జిల్లాలోనూ బీజేపీ నేతల అంతర్గత కు మ్ములాటలు తీవ్రమయ్యాయి. రెండేండ్ల క్రితం పార్టీలో చేరిన కొండేటి శ్రీధర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై మొదటి నుంచీ పార్టీని అంటిపెకున్నవారు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి జిల్లా అధ్యక్షుడు అయిన ఆ నేత తీరుపై సీనియర్లు అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. బీజేపీలో పాత నేతలంతా ఇటీవలే జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు.

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలు వరంగల్‌, హనుమకొండగా మారిన తర్వాత పార్టీ పరంగా పలు మార్పులు జరిగాయి. వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి చెందిన సిద్ధం నరేశ్‌ గతంలో బీజేవైఎం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడు. ఇటీవల ఆయనకు వరంగల్‌ జిల్లా బాధ్యతలు ఇవ్వాల్సి ఉండగా పూర్తిగా తొలగించి కొత్త వారిని నియమించారు. దీంతో పార్టీలో పాతవారిని కాదని కొత్త వారికి పదవులు ఇస్తున్నారంటూ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఎవరికి వారుగా సొంత కార్యలయాలు నిర్వహిస్తుండడంపైనా పలువురు రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. ‘వడ్లు కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఉద్యమాలు చేస్తుంటే.. బీజేపీలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తమ పార్టీ పరిస్థితిని వివరించారు. మొత్తానికి వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో నాయకుల అంతర్గత కుమ్ములాటలతో బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందనే చెప్పాలి.

- Advertisement -