తెలంగాణ ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వ్యాఖ్యలపై స్పందించారు. వీరిద్దరి మద్య ట్విట్టర్ వేదికగా ఆసక్తిక చర్చ జరిగింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఖాతాబుక్ సీఈఓ ఆవేదన వ్యక్తం చేయగా.. తక్షణమే మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండి అంటూ మొన్న కేటీఆర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం డీకే శివకుమార్ స్పందించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని సవాల్‌గా తీసుకుంటామని చెప్పిన డీకే.. 2023 చివరి నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పుకొచ్చారు.
శివకుమార్ అన్నా.. కర్నాటక రాజకీయాల గురించి అంతగా తెలియదని, అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేనని, కానీ మీరు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశ యువత, సౌభాగ్యం కోసం ఉద్యోగాల కల్పన ద్వారా హైదరాబాద్, బెంగుళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌళిక సదుపాయాల కల్పన, ఐటీ, బీటీలపై ఫోకస్ పెడుదామని, కానీ హలాల్, హిజాబ్ లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.