మన శరీరంలో అత్యంత కీలకమైన అవయాల్లో కిడ్నీలు ఒకటి. మన శరీరంలోని వర్థ్యాలను ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తాయి. అందుకే వాటికి కాపాడుకోవాలి. మనం చేసే కొన్ని తప్పుల వల్ల కిడ్నీలు పాడైయే ప్రమాదం ఉంది. యుక్త వయసులో ఏడాదికోసారి, మధ్య వయసు దాటిన తర్వాత నుంచి ఆరు నెలలకు ఒకసారి అయినా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే మన కిడ్నీలను సురక్షతంగా ఉంచుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటో చూద్దాం..
-పొగతాగడం అన్నది రక్త నాళాల పూడికకు లేదా దెబ్బతినడానికి కారణమవుతుంది. కిడ్నీల్లో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. పొగతాగడం వల్ల రీనల్ సెల్ కార్సినోమా (కిడ్నీ కేన్సర్)కు దారితీసే ప్రమాదం ఉంది.
-మధుమేహులు, తక్కువ బరువుతో పుట్టిన వారు, గుండె జబ్బులున్న వారు, అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
-వైద్యులు సూచించినప్పుడే ఔషధాలు తీసుకోవాలి. సొంతంగా వాటిని ఫార్మసీ స్టోర్లలో కొనుగోలు చేసి వాడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని రకాల మందులు కిడ్నీలకు హాని చేస్తాయి. వీటిని ఎక్కువ రోజుల పాటు తీసుకోకూడదు. అందుకే సొంత వైద్యం మానుకోవాలి.
-రక్తపోటు నియంత్రణలో పెట్టుకోకపోతే అది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని గుర్తుంచుకోవాలి. ఇందుకోసం నిత్యం వ్యాయామం చేయాలి. పరుగు, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్స్ చేసినా కిడ్నీలకు మంచిదే. ఇలా శారీరక శ్రమ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి.
-తగినంత నీరు తీసుకోవడం కూడా కిడ్నీల ఆరోగ్యానికి అవసరం. రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అంటే రెండు లీటర్లు. నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న సోడియం, వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు బయటకు పంపించగలవు. అప్పుడు కిడ్నీలపై చెడు ప్రభావం పడదు.
-నీరు తగినంత తీసుకోకపోతే అధిక సోడియం, వ్యర్థాలు శరీరంలో ఉండిపోయి కిడ్నీలకు హాని చేస్తాయి. రోజుకు మూడు లీటర్ల నీరు కూడా తీసుకోవచ్చు. వయసు, ఉష్ణోగ్రతలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటి అంశాల ఆధారంగా తీసుకోవాల్సిన నీటి పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో వైద్యులను సంప్రదించి ఎవరికి వారు సూచన పొందాలి.