దళితుల సంక్షేమంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌..

84
- Advertisement -

దళిత బంధు పథకం అమలు వేగంగా పూర్తి అవుతుందని, దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గంలో దళిత బంధు ప్రాజెక్టులో భాగంగా 100 యూనిట్లను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల కోసం నేరుగా పది లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. నూతన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ టెండర్లలో ఎస్సీల అవకాశం ఇస్తున్నామని, దళితుల సంక్షేమంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఎస్సీ లతో ప్రారంభమైన కల్యాణ లక్ష్మి తర్వత అన్ని వర్గాల వారికి ఇస్తున్నామని తెలిపారు. దళిత బంధు ఒక పథకం కాదు, ఒక ఉద్యమం అని పేర్కొన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదని మంత్రి మండిపడ్డారు. అన్ని వర్గాల శ్రమను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటున్నదని మంత్రి ఘాటుగా విమర్శించారు. ఎన్నికల కోసమే బీజేపీ స్టంట్ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో పవర్ హాలిడే లేదు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ పవర్ ఫుల్ స్టేట్‌గా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలో కరెంట్ సమస్య లేకుండా చేశాం. కేంద్రం తీరు వల్లనే దేశం మొత్తం కరెంట్ సంక్షోభంలో ఉందన్నారు మంత్రి హరీష్‌ రావు.

- Advertisement -