తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటలయుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు రాహుల్. అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని..రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
దీనిపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్‌లో సంఘీభావం చెప్పడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదన్నారు. పంజాబ్, హర్యానాలో ధాన్యం సేకరించిన మాదిరిగానే తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని కోరుతున్నామని రాహుల్‌కు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారని….మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని… ఒకే దేశం – ఒకే సేకరణ విధానం కోసం రాహుల్ డిమాండ్ చేయాలని కవిత సూచించారు.